బాల్యం నుండి స్వయంసేవక్ నే… తిరిగి ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తా!

బాల్యం నుండి స్వయంసేవక్ నే… తిరిగి ఆర్ఎస్ఎస్ కోసం పనిచేస్తా!
 
* పదవీ విరమణ సందర్భంగా కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి
 
కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా సోమవారం పదవీ విరమణ చేసిన జస్టిస్ చిత్త రంజన్ దాష్  తాను బాల్యం నుండి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సభ్యుడినని వెల్లడించారు. ఇప్పుడు తిరిగి వారు ఏపని అప్పచెపినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. 
 
 “కొంతమంది వ్యక్తులకు అసహనం కలిగించినా, నేను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యుడిని అని  ఇక్కడ అంగీకరించాలి. ఆ సంస్థకు నేను చాలా రుణపడి ఉన్నాను. నేను నా చిన్ననాటి నుండి, నా యవ్వనం అంతా అక్కడే ఉన్నాను” అని హైకోర్టులో తన వీడ్కోలు ప్రసంగంలో జస్టిస్ డాష్ తెలిపారు. అయితే న్యాయవాద వృత్తిలో తలమునకలై ఉంటున్న కారణంగా సుమారు 37 సంవత్సరాలుగా ఆ సంస్థకు దూరంగా ఉన్నానాని చెప్పారు.
 
“నేను ఆర్ఎస్ఎస్ తో నా అనుబంధాన్ని నా కెరీర్‌లో ఎలాంటి పురోగతికి ఉపయోగించలేదు. ఎందుకంటే ఇది దాని సూత్రాలకు విరుద్ధం. నేను ప్రతి ఒక్కరినీ సమానంగా చూసాను. అతను ధనవంతుడు లేదా పేదవాడు, అతను కమ్యూనిస్ట్, లేదా బిజెపి, కాంగ్రెస్ లేదా  టిఎంసి అయినా నా ముందు అందరూ సమానులే; నేను ఎవరికీ లేదా ఏదైనా నిర్దిష్ట రాజకీయ తత్వశాస్త్రం లేదా యంత్రాంగం పట్ల ఎలాంటి పక్షపాతాన్ని ప్రదర్శించలేదు” అంటూ ఆయన స్పష్టం చేశారు. 
జీవితంలో తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవాడినని చెప్పుకునే ధైర్యం తనకు ఉందని జస్టిస్ దాష్ తెలిపారు. “నేను మంచి వ్యక్తిని అయితే, నేను చెడ్డ సంస్థకు చెందినవాడిని కాలేను,” అని ఆయన చెప్పారు. 14 సంవత్సరాలకు పైగా హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత పదవీ విరమణ చేస్తూ, జస్టిస్ డాష్ ఇలా అన్నారు:
 
 “నేను ధైర్యంగా, నిజాయతీపరుడిగా, ఇతరుల పట్ల సమాన దృక్పథాన్ని కలిగి ఉండటం నేర్చుకున్నాను. అన్నింటికంటే, దేశభక్తి, పని పట్ల నిబద్ధత భావం అలవరచుకొన్నాను. సానుభూతి సూత్రాలపై న్యాయం అందించే ప్రయత్నం చేసాను. న్యాయం చేయడానికి చట్టాన్ని వంచవచ్చు, కానీ చట్టానికి అనుగుణంగా న్యాయాన్ని వంచలేము”. 
 
ఒడిశాలోని సోనేపూర్‌లో 1962లో జన్మించిన జస్టిస్ డాష్ 1985లో కటక్‌లోని మధు సూదన్ లా కాలేజీ నుండి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. 1986లో న్యాయవాదిగా నమోదు చేసుకున్నారు. 1992లో రాష్ట్ర ప్రభుత్వ అదనపు స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులై 1994 వరకు కొనసాగారు. జస్టిస్ డాష్ ఫిబ్రవరి 1999లో ఒరిస్సా సుపీరియర్ జ్యుడీషియల్ సర్వీస్ (సీనియర్ బ్రాంచ్)లో డైరెక్ట్ రిక్రూట్‌గా చేరారు. 
 
 ఆ తర్వాత అక్టోబర్ 2009లో ఒరిస్సా హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.  జూన్ 20, 2022 న బదిలీపై కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా చేరారు.