ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్‌కు కంగనా వీడ్కోలు

ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్‌కు కంగనా వీడ్కోలు
ఎంపీగా గెలుపొందితే బాలీవుడ్‌కు వీడ్కోలు పలకాలనుకుంటున్నా అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన మనసులోని మాటను బయటపెట్టారు. సినిమాలు వదిలేసి ప్రజల్లోకి వచ్చి ఒక ఉత్తమ ఎంపీగా తన నియోజక వర్గానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. అదే తనకు గొప్ప అవార్డుగా భావిస్తానని కంగనా రనౌత్ బదులు ఇచ్చారు.
 
ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆమె  బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే టికెట్ కేటాయించినప్పటి నుంచి ఆమె ప్రచారంలో దూకుడు కనబరుస్తున్నారు. తన నియోజకవర్గం మొత్తం పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలపై మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి ఆమె ప్రస్తుతం బరిలోకి దిగారు.  తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కంగనా రనౌత్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. ఎన్నికల్లో విజయం సాధిస్తే సినిమాలకు దూరంగా ఉంటారా అని అడగ్గా.. ఆమె అవుననే సమాధానం ఇచ్చారు. బాలీవుడ్‌లో తాను విజయం సాధించానని, హీరోయిన్‌గా ఎన్నో అవార్డులు అందుకున్నానని కంగనా తెలిపారు.
 
అయితే ఇదే సమయంలో రాజకీయాల్లోకి వెళ్లినా సినిమా ఇండస్ట్రీలో కొనసాగాలని కోరుతూ నిర్మాతల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని ఆమె చెప్పారు. తాను ఒక ప్రతిభావంతమైన నటిని అన, సినిమాలకు తనను దూరంగా ఉండొద్దని చాలా మంది నిర్మాతలు, ప్రముఖ నటులు కోరుతున్నట్లు కంగనా వివరించారు. 
అయితే అంతకుముందు వేరే ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఎన్నికలకు ముందు తాను సంతకం చేసిన కొన్ని సినిమాలు పెండింగ్‌లో ఉన్నాయి.. ఈ కారణంతో రాజకీయాల్లోకి వచ్చి వెంటనే బాలీవుడ్‌ను విడిచిపెట్టలేనని ఆమె పేర్కొన్నారు.

ఇక కంగనా నటించిన తాజా చిత్రం ఎమర్జెన్సీ వాయిదా పడింది. ప్రస్తుతం దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆమె ప్రచారంలో మునిగిపోయి ఉండటంతో ఎమర్జెన్సీ చిత్రం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. ఈ సినిమాకు కంగనా రనౌత్ సొంత దర్శకత్వంలో రూపొందుతోంది.