దేశంలోనే అత్యధికంగా ఏపీలో 82 శాతం పోలింగ్

దేశంలోనే అత్యధికంగా ఏపీలో 82 శాతం పోలింగ్
ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పోలింగ్ లలో దేశం మొత్తం మీద అత్యధికంగా ఆంధ్ర ప్రదేశ్ లో సుమారు 82 శాతం జరిగింది. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా దర్శిలో 90.99 అత్యధికంగా పోలింగ్ జరిగింది. పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒంగోలు 87.06 శాతం నమోదైంది.  అసెంబ్లీలో తిరుపతిలో అతి తక్కువగా 62.32శాతం పోలింగ్ జరిగింది. 2019లో ఇక్కడ 65.9 శాతం పోలింగ్ జరిగింది. 

విశాఖ పార్లమెంట్ లో అతి తక్కువగా 71.11శాతం పోలింగ్ నమోదైంది. 2019లో విశాఖలో 67శాతం మాత్రమే పోలింగ్ జరిగింది. 2019లో కన్నా రెట్టింపు సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ పత్రాలు నమోదయ్యాయి.  ఏపీలో మొత్తం 4,13,33,702 మంది ఓటర్లు ఉండగా, వారిలో 3,33,40,560మంది 25 పార్లమెంటు నియోజక వర్గాలకు ఓటు వేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్​ కుమార్​ మీనా  చెప్పారు.

175 అసెంబ్లీ నియోజక వర్గాలకు  3,33,40,333 ఓట్లు పోలైనట్టు సీఈఓ ప్రకటించారు.  ఈవిఎంలలో జరిగిన  పోలింగ్‌లో మొత్తం 80.66 పోలింగ్ జరిగిందన్నారు. రాష్ట్రంలో  పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఎన్నికల విధుల్లో ఉన్న  4.44లక్షల  ఓట్లు పోలయ్యాయని, వీరితో వృ ద్ధులు, వికలాంగులు, హోమ్‌ ఓటింగ్‌ వేసిన వారిని కలిపితే మొత్తం 4.97లక్షల మంది ఓటు వేశారని చెప్పారు.

 ఈవిఎంలో ఓటు వేసిన వారితో కలిపితే మొత్తం ఏపీలో 81.81 శాతం పోలింగ్ జరిగిందని చెప్పారు. దాదాపుగా 82శాతం పోలింగ్‌ నమోదైందని వివరించారు. 2019లో ఏపీలో  79.77 శాతం పోలింగ్‌ జరిగిందని చెబుతూ గతంతో పోలిస్తే ఈవిఎంలో 1శాతం ఎక్కువ నమోదైందని తెలిపారు. దేశంలో జరిగిన నాలుగు దశల్లోనే అత్యధికంగా ఏపీలో పోలింగ్ జరిగిందన్నారు. గతంలో 56 వేల పోస్టల్ బ్యాలెట్లు రిజెక్ట్ అయ్యాయని, ఈసారి అలా జరగకుండా చూశామని వివరించారు.

రాష్ట్రంలో జరిగిన పోలింగ్‌లో  పెద్ద సంఖ్యలో ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారని సీఈఓ మీనా తెలిపారు. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్‌ ముగియాల్సి ఉన్నా ఆరు తర్వాత పెద్ద సంఖ్యలో ఓటర్లు కేంద్రాల్లో ఉన్నారని చెప్పారు.  సాయంత్రం నాలుగు తర్వాత మళ్లీ ఓటర్ల సంఖ్య పెరిగినట్టు చెప్పారు. రాష్ట్రంలో  5600 కేంద్రాల్లో 1200 ఓట్ల కంటే ఎక్కువ ఉన్నాయని చెప్పారు. 

చాలా చోట్ల సాయంత్రం ఆరు తర్వాత పోలింగ్ జరిగిందని చెబుతూ చివరి పోలింగ్ కేంద్రంలో మరుసటి రోజు తెల్లవారుజాము 2గంటల వరకు పోలింగ్ జరిగిందని తెలిపారు. ఈవిఎంలను పగులగొట్టిన చోట కూడా వెంటనే పోలింగ్ కొనసాగించినట్టు చెప్పారు.  రాష్ట్రంలో ఎక్కడా అబ్జర్వర్లు రీ పోలింగ్‌ కు సిఫార్సు చేయలేదని పేర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా  33లోకేషన్స్‌లో స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 350 స్ట్రాంగ్‌ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.