రాహుల్ తో చర్చకు బిజెపి రాయబరేలి యువనేత!

రాహుల్ తో చర్చకు బిజెపి రాయబరేలి యువనేత!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీతో బహిరంగ చర్చకు బీజేపీ సిద్దమయింది. బిజెపి తరఫున చర్చలో పాల్గొనేందుకు ఆ పార్టీ యువ మోర్చా ఉపాధ్యక్షుడు అభినవ్‌ ప్రకాశ్‌ను రంగంలోకి దింపింది. దీనిపై తన స్పందన తెలియజేయాలని కర్ణాటకకు చెందిన బీజేపీ ఎంపీ, యువమోర్చ అధ్యక్షుడు తేజస్వి సూర్య, రాహుల్‌గాంధీని కోరారు.

ఒక రాజకీయ వారసుడికి, ఒక సామాన్యుడికి మధ్య ఈ చర్చ జరగబోతోంది పేర్కొన్నారు. ఎన్నికల వేళ రాహుల్‌ గాంధీ, ప్రధాని మోదీ మధ్య బహిరంగ చర్చ జరగాలని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌, దిల్లీ హైకోర్టు మాజీ సీజే జస్టిస్‌ అజయ్‌ పి.షా, ‘ది హిందూ’ పత్రిక మాజీ ఎడిటర్‌ ఎన్‌.రామ్‌లు లేఖ బహిరంగ లేఖ రాశారు.

ఈ విషయంపై రాహుల్‌ గాంధీ సానుకూలంగా స్పందించారు. ప్రధాని మోదీ కూడా ఇందులో భాగమవుతారని ఆశిస్తున్నట్లు ‘ఎక్స్‌’లో ట్వీట్ చేశారు. అయితే, ప్రధానితో చర్చించే అర్హత రాహుల్‌కు లేదంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలోనే రాహుల్‌కు తేజస్వి సూర్య లేఖ రాశారు.

బీజేపీ తరఫున బీజేవైఎం ఉపాధ్యక్షుడు అభినవ్‌ ప్రకాశ్‌ను నామినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.  ఈ డిబేట్‌కు అభినవ్ ప్రకాశ్ సహితం​ ఓకే చెప్పారు. ఈ మేరకు తనకు ఆసక్తిగా ఉన్నట్లు అభినవ్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. తేజస్వి సూర్య ప్రతిపాదించిన అభినవ్‌ ప్రకాశ్​ స్వస్థలం ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ. ప్రస్తుతం రాహుల్‌ ఇదే నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు.

దళిత సామాజిక వర్గానికి చెందిన అభినవ్‌, ప్రస్తుతం బీజేవైఎం ఉపాధ్యక్షునిగా ఉన్నారు. తమ ప్రభుత్వ విధానాలు, సంస్కరణలను సమర్థంగా వివరించగలరని తేజస్వి తన లేఖలో పరిచయం చేశారు. జవహర్‌ లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ మాజీ విద్యార్థి అయిన అభినవ్, ప్రస్తుతం డిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్జాస్‌ కళాళాలలో ఆర్థిక శాస్త్రం అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారని చెప్పారు. సామాజిక, ఆర్థిక, రాజీకీయ అంశాల్లో ఆయనకు విస్తృత అవగాహన ఉందని తెలిపారు. రాహుల్‌ నిర్ణయమే ఇక తరువాయి అని పేర్కొన్నారు.