
కాంగ్రెస్, ఇండియా కూటమికి పొరుగు దేశం పాకిస్థాన్‌పై ప్రేమ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ఇండియా కూటమిలోని పార్టీలకు జాతీయ ప్రయోజనాల గురించి ఆందోళన లేదని ధ్వజమెత్తారు. దేశ వ్యతిరేక ప్రకటనలు చేయడానికి వారి మధ్య పోటీ ఉందని ఎద్దేవా చేశారు.
మధ్యప్రదేశ్‌లోని ఖార్గోన్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ విపక్షాలకు చురకలంటించారు. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ విడతలు పెరుగుతున్నకొద్దీ కాంగ్రెక్‌కు పాకిస్థాన్‌పై ప్రేమ పెరుగుతోందని విమర్శించారు. భారత సైన్యం ఉగ్రదాడులు చేస్తోందని, పాక్ సైన్యం మౌనంగా ఉందని ఓ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పేర్కొనడం పట్ల విస్మయం వ్యక్తం చేశారు.
ముంబయి ఉగ్రదాడుల వెనుక పాకిస్థాన్ హస్తం లేదని మరో కాంగ్రెస్ నేత ఇటీవల వ్యాఖ్యానించారని ప్రధాని గుర్తు చేశారు. ఈ ప్రకటనలు చేస్తున్న ఇండియా కూటమి నేతల ఉద్దేశం ఏంటని యువరాజు(రాహుల్ గాంధీని ఉద్దేశించి)ను అడగాలనుకుంటున్నానని అని ప్రధాని తెలిపారు.
ఎందుకు ఇండియా కూటమికి పాకిస్థాన్‌పై ఇంత ప్రేమ? భారత సైన్యంపై ఇంత ద్వేషం? కాంగ్రెస్ ఉద్దేశాలు ఎంత ప్రమాదకరమైనవో తెలుసుకోవాలంటే 20-25 ఏళ్లు ఆ పార్టీలో ఉండి ఇప్పుడు వీడిన వారి మాటలు వినాలని ప్రధాని సూచించారు. ఇప్పుడు వారు స్వచ్ఛమైన గాలిని పీల్చుకుంటున్నట్లు భావిస్తున్నారని తెలిపారు.
“మీ ఒక్క ఓటు భారతదేశాన్ని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చింది. మీ ఒక్క ఓటు వల్ల ఆర్టికల్ 370 రద్దు సాధ్యమైంది. మీ ఒక్క ఓటు ఆదివాసీ మహిళను భారత రాష్ట్రపతిని చేసింది. మీ ఒక్క ఓటు అవినీతిపరులను జైలుకు పంపింది. మీ ఒక్క ఓటు శక్తి ఎంతటిదంటే 500 ఏళ్ల నిరీక్షణ (రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ) ముగిసింది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.
More Stories
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం