దిశ ఎన్‌కౌంటర్ కేసులో హైకోర్టులో పోలీసులకు ఊరట

దిశ ఎన్‌కౌంటర్ కేసులో హైకోర్టులో పోలీసులకు ఊరట
హైదరాబాద్ సమీపంలో జరిగిన దిశ అత్యాచారం, హత్య కేసు తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసింది. ఈ కేసులోని నలుగురు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేయడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ హైకోర్టు సంచలన ఉత్తర్వులు వెలువరించింది. 
 
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులకు ఊరట కల్పించింది. దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక సరిగా లేదని పోలీసులు హైకోర్టును ఆశ్రయించగా.. తాజాగా ఈ మేరకు తీర్పును వెలువరించింది.  దిశ నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన ఘటనకు సంబంధించి విచారణ జరిపేందుకు నియమించిన సిర్పూర్కర్ కమిషన్.. విచారణ తర్వాత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని నివేదిక ఇచ్చింది.
అయితే సిర్పూర్కర్ కమిషన్ నివేదికను సవాల్ చేస్తూ ఏడుగురు పోలీస్ అధికారులతోపాటు షాద్ నగర్ తహసిల్దార్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 
ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన హైకోర్టు  పోలీస్ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి స్టే విధించారు. దీంతో ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పోలీసులకు ఊరట లభించింది. 
దిశా నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన ఘటనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు సిర్పూర్ కమిషన్‌ను నియమించింది. దీంతో రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పర్యటించిన సిర్పూర్ కమిషన్ పలువురిని విచారించింది. విచారణ పూర్తి చేసిన సిర్పూర్కర్ కమిషన్ చివరికి దిశా నిందితులను ఎన్‌కౌంటర్ చేసిన పోలీసు అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సూచించింది. 
 
పోలీసు అధికారులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేసి విచారణ జరపాచాలని పేర్కొంది. అయితే సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక సరిగా లేదంటూ హైకోర్టులో పోలీసు అధికారులు పిటిషన్‌ వేశారు.