
ఏపీలోని కీలక పోలీస్ అధికారులపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు చేసింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పి.సీతారామాంజనేయులు, విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటాలపై ఈసీ వేటు వేసింది. వీరిని తక్షణమే బదిలీ చేయడంతో పాటు సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు ఎన్నికలతో సంబంధం లేని విధులు అప్పగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.
ఈ అధికారులపై ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఈ ఇద్దరు అధికారులు అధికారపార్టీతో అంటకాగుతున్నారని ఆరోపణలు చేశాయి. విజయవాడలో సీఎంపై రాయి దాడి ఘటనలో దర్యాప్తు సరిగ్గా లేదని టీడీపీ ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై విజయవాడ సీపీని ఈసీ వివరణ కోరింది. సీఎం జగన్ రెడ్డి రోడ్ షోలో రాయి దాడి ఘటనను ఈసీ సీరియస్‌గా తీసుకోవడంతో ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
వీరి స్దానాల్లో కొత్త వారి నియామకం కోసం గత ఐదేళ్లలో ఎటువంటి విజిలెన్స్ కేసులు లేని ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారుల పేర్లను ఒక్కో పోస్టుకు నేటి (బుధవారం) మధ్యాహ్నాం 3గంటల్లోగా పంపాలని ఉత్తర్వులలో పేర్కొంది. బదిలీ అయిన అధికారులు విధుల నుండి తప్పుకునే సమయంలో తమ దిగువ ర్యాంకు అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఇసి ఆదేశించింది.
రాష్ట్రంలో ఇప్పటికే గుంటూరు ఐజి పాలరాజుతో పాటు పరమేశ్వరరెడ్ డి (ఒంగోలు), వై,రవి శంకర్‌రెడ్ డి(పల్నాడు), పి.జాఘవా (చిత్తూరు), కెకె అన్బురాజన్ (అనంతపురం), కె.తిరుమలేశ్వర్ (నెల్లూరు) ఎస్‌పిలపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే. వారితో ముగ్గురు ముగ్గురు ఐఎఎస్ అధికారులను కూడా ఇసి బదిలీ చేసింది.
గులకరాయ వ్యవహారం రాజకీయ రంగు పులుముకోవడంపై ఈసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం ప్రయాణిస్తున్న ప్రాంతంలో కరెంటు లేకపోవడం ఏంటని ప్రశ్నించింది. అయినా సీఎంను బస్సుపైన నిలబెట్టి ఎన్నికల ప్రచారం చేయించడంపై ఏపీ పోలీసు అధికారులపై సీరియస్ అయింది.
సీఎంపై దాడి ఘటన తదనంతర పరిణామాలపైన సీపీ వ్యవహార శైలిపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ సంఘటనలో సెక్యూరిటీకి సబంధించి ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ఆయన వైఫల్యంం చెందారని కేంద్ర ఎన్నికల సంఘం భావించినట్లు సమాచారం. దీంతో పాటు ఆయన అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
గత నెలలో ప్రధాని చిలకలూరిపేట వద్ద పాల్గన్న బహిరంగ సభలో భద్రతా చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెందడం ఇంటెలిజెన్స్ చీఫ్‌పై వేటుకు ప్రధాన కారణమని సమాచారం. ఈ విషయమై బిజెపితో పాటు టిడిపి,జనసేనలు ఇసికి ఫిర్యాదు చేశాయి.
అంతే కాకుండా ఎన్నికల నియమావళికి విరుద్దంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడం, ఇంటెలిజెన్సీ చీఫ్‌గా కొనసాగితే మే 13 న జరుగునున్న సాధారణ ఎన్నికలు పారదర్శకంగా జరిగే అవకాశాలు ఉండవని ఎన్‌డిఎ కూటమి కేంద్ర ఎన్నికల సంఘానికి వరుస పిర్యాదుల చేసిన నేపథ్యంలో ఆయనపై బదిలీ వేటు పడిందని భావిస్తున్నారు.
ఈ రెండు పోస్టులకు బుధవారం మధ్యాహ్నం 3 గంటల లోపు ముగ్గురు ఏడీజీపీ, ముగ్గురు ఐపీఎస్ ర్యాంకు అధికారుల పేర్లతో ప్యానల్ పంపాలని సీఎస్ ను ఆదేశించింది ఈసీ. మరోవంక, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిని ఎన్నికల సంఘం ఇటీవల సస్పెండ్ చేసింది. ఈసీ ఆదేశాలతో పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట్రామిరెడ్డి సస్పెన్షన్ కాలంలో హెడ్‌క్వాటర్స్ దాటి వెళ్లొద్దని ఈసీ ఉత్తర్వుల్లో తెలిపింది.
వెంకట్రామిరెడ్డి కడప జిల్లా బద్వేలులో వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆర్టీసీ ఉద్యోగులతో సమావేశమైన ఆయన వైసీపీకి ఓటు వేయాలని కోరారని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. కడప జిల్లా కలెక్టర్ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకుంది. వెంకట్రామిరెడ్డి పంచాయతీరాజ్ శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు.
ఎన్నికల నేపథ్యంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ వాసుదేవరెడ్డిని బదిలీ చేయాలని ఇటీవల ఈసీ ఆదేశించింది. తన దిగువ స్థాయి అధికారికి బాధ్యతలు అప్పగించి తక్షణమే విధుల్లోంచి తప్పుకోవాలని వాసుదేవరెడ్డిని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు సీఎస్ జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వాసుదేవరెడ్డికి ఎలాంటి ఎన్నికల విధుల్ని అప్పగించొద్దని ఈసీ స్పష్టం చేసింది. మద్యం ఉత్పత్తి, విక్రయాల వ్యవహారంలో వచ్చిన ఆరోపణలపై వాసుదేవరెడ్డిపై చర్యలు ఈసీ చర్యలు తీసుకుంది.
More Stories
భారత్‌ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!