
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భూటాన్ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్రూక్ గ్యాల్పో’ను ప్రదానం చేశారు. భూటాన్‌లో రెండు రోజుల అధికార పర్యటన కోసం శుక్రవారంనాడిక్కడకు విచ్చేసిన మోదీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్వేల్ వాంగ్‌చుక్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వాంగ్‌చుక్ చేతుల మీదుగా మోదీ ఈ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు.
ఇరుదేశాల సంబంధాలను బలోపేతం చేయడం, కరోనా సమయంలో తొలి విడతలోనే 5,00,000 టీకాలను అందజేయడం వంటి చర్యలు తీసుకున్నందుకు మోదీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. భూటాన్ దేశపు అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న తొలి విదేశీ ప్రధాని నరేంద్ర మోదీ కావడం విశేషం.
భూటాన్ రాజు 114వ నేషనల్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా 2021 డిసెంబర్ 17న మోదీకి ” ‘డ్రూక్ గ్యాల్పో” అవార్డును ప్రకటించారు. అయితే ఆ తర్వాత అనివార్య కారణాలతో మోదీ అక్కడకు వెళ్లలేకపోయారు. జాతీయ, ప్రాంతీయ, గ్లోబల్ నాయకత్వానికి ప్రతీకగా మోదీ నిలిచారని, ఆయన ఆధ్వర్యంలో ఇండియా ప్రపంచంలోనే అత్యంత వేగవంతంగా ఆర్థికాభివృద్ధి సాధించిందని, 2030 నాటికి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని భూటాన్ ఒక అధికారిక ప్రకటనలో ప్రశంసించింది.
టెక్నాలజీ, ఇన్నొవేషన్ రంగంలో ఇండియాను డైనమిక్ దేశంగా మోదీ తీర్చిదిద్దుతున్నారని తెలిపింది. అత్యున్నత పురస్కారం అందుకున్న సందర్భంగా మోదీ మాట్లాదుతూ, ఇరుదేశాల మధ్య అనాదిగా సత్సంబంధాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తాను 2014లో ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత భూటాన్ పర్యటించినప్పుడు సొంతదేశంలోనే ఉన్న అనుభూతి కలిగిందని తెలిపారు.
పదేళ్ల క్రితం తనకు భూటాన్‌లో లభించిన సాదర స్వాగతం ఎన్నటికీ మరువలేనని చెప్పారు “ఈరోజు నా జీవితంలో ఒక గోప్ప రోజు. భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్నారు. ప్రతి అవార్డుకు ప్రత్యేకత ఉంటుంది. కానీ విదేశీ గడ్డపై ఒక అవార్డు తీసుకున్నప్పుడు ఇరుదేశాలు సరైన మార్గంలో పయనిస్తున్నాయనే స్పష్టమైన సంకేతాలను ఇస్తుంది. ఈ పురస్కారం ప్రతి ఒక్క భారతీయునికి చెందుతుంది. 140 కోట్ల భారతీయులకు ఈ అవార్డును అంకితం చేస్తున్నాను” అని మోదీ హర్షాతిరేకం వ్యక్తం చేశారు.
భూటాన్ అత్యున్నత పౌర పురస్కారం ‘డ్రూక్ గ్యాల్పో’ అందుకున్న మోదీ “భారత్, భూటాన్ మధ్య సంబంధాలు ప్రాచీనకాలం నుండి కొనసాగుతున్నాయి. సమకాలీనమైనవిగా ఉన్నాయి. నేను 2014 లో భారత ప్రధాని అయినప్పుడు, నా మొదటి విదేశీ పర్యటనగా భూటాన్ సందర్శించడం సహజం. భూటాన్ అందించిన స్వాగత,సానుభూతి 10 సంవత్సరాల క్రితం ప్రధానమంత్రిగా విధి నిర్వహణలో నా పర్యటనను చిరస్మరణీయమైనదిగా మార్చింది’’ అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలిపారు.
అంతకు ముందు, పారో విమానాశ్రయానికి చేరుకున్న భారత ప్రధానికి ఘానా స్వాగతం లభించింది. భూటాన్ ప్రధానమంత్రి షెరింగ్ టోబ్గే ఘనంగా స్వాగతం పలికారు. భూటాన్‌లో ప్రధాని మోదీకి అపూర్వమైన స్వాగతం పలుకుతూ, పారో నుంచి దేశ రాజధాని థింపూ వరకు 45 కిలోమీటర్ల పొడవునా ప్రజలు వీధుల్లో బారులు తీరారు.
“భూటాన్ ప్రజలకు, ముఖ్యంగా చిన్న పిల్లలకు, వారి అందమైన దేశానికి చిరస్మరణీయ స్వాగతం పలికినందుకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని ప్రధాని మోదీ ఎక్స్ లో రాశారు. ఈ కార్యక్రమానికి అగ్రగామిగా, భూటాన్ యువకుల బృందం థింపూ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి భారత నాయకుడు స్వయంగా రాసిన గర్బా పాటను ప్రదర్శించడం ద్వారా ప్రత్యేక స్వాగతం పలికారు.
More Stories
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన