
మండే ఎండలతో అల్లాడిపోతున్న తెలంగాణలో వచ్చే నాలుగు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మలాజిగిరి, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం పలు జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు కురిశాయి.
మహారాష్ట్ర నుంచి కర్ణాటక వీదుగా ఉత్తర కేరళ వరకు ద్రోణి కొనసాగుతున్నట్టు ఐఎండీ తెలిపింది. భారీ వర్షాలు కురిసే జిల్లాల్లో విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకూలడం, రవాణా వ్యవస్థ స్తంభించడం వంటివి చోటుచేసుకోవచ్చని హెచ్చరించింది. రాష్ట్రంలో శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు తొమ్మిది జిల్లాల్లో వందకుపైగా ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ తెలిపింది.
అత్యధికంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలాల్లో 5 సెం.మీ, కరీంనగర్లో 4 సెం.మీ. వర్షపాతం నమోదైంది. కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో వడగండ్ల వానలు పడ్డాయి. వర్షాలతో రాష్ట్రమంతటా ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా రెండు నుంచి నాలుగు డిగ్రీల వరకు తగ్గుముఖం పట్టాయి.
వడగండ్ల వానల కారణంగా కోతకు వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. ఉద్యాన పంటలు నేల రాలాయి. వ్యవసాయ, రెవెన్యూ శాఖలు పంటల నష్టాన్ని అంచనా వేయనున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ముస్తాబాద్‌లో చెట్టు కొమ్మలు కూలి విద్యుత్తు స్తంభంపై పడటంతో అది విరిగి వ్యవసాయ కూలీలపై పడింది. తీవ్రంగా గాయపడిన ఒకరు దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు. జిల్లాలో పలు చోట్ల సోమవారం సాయంత్రం 6.30 గంటలకు మొదలైన వడగండ్ల వాన అరగంటపాటు కురిసింది.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు