
ములుగులో ఏర్పాటు చేసిన సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తాత్కాలిక భవనాన్ని ములుగు మండలం, జాకారం గ్రామంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్‌లో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, రాష్ట పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపి కవితలతో కలసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ విశ్వవిద్యాలంలో తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు. సమ్మక్క సారక్క యూనివర్సిటికి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నోడల్ గా ఉంటుందని చెప్పారు. మహిళ దినోత్సవ సందర్బంగా సమ్మక్క సారలమ్మ జాతీయ గిరిజన వర్సిటీ ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో గిరిజనుల అక్షరాస్యత 49 శాతంగా ఉందని, గిరిజన మహిళలలో 39 శాతంగా ఉందని, వారిలో 100కు వందశాతం అక్షరాస్యత శాతం పెంచడమే ముఖ్య ఉద్దేశంగా గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేశామని కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సమ్మక్క, సాలరమ్మ సెంట్రల్ యూనివర్సిటీ కోసం రూ. 889.07 కోట్ల నిధులను కేటాయించిందని చెబుతూ తెలంగాణ ప్రాంతంలో ఉన్నత విద్య ప్రాముఖ్యత, నాణ్యతను మెరుగుపరచడానికి ఇదొక సువర్ణ అవకాశమని పేర్కొన్నారు.
2024- 25 విద్యా సంవత్సరం నుండి ప్రస్తుతం ఏర్పాటు చేసిన జాకారం యూత్ ట్రైనింగ్ సెంటర్లో బిఏ ఇంగ్లీష్, బిఏ సోషల్ స్టడీస్ రెండు కోర్సులతో తరగతులను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించాయిరు. స్థానిక యువత యూనివర్సిటీలో ప్రవేశం కోసం దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఈ యూనివర్సిటిలో 35 శాతం ప్రత్యేకంగా గిరిజన విద్యార్థుల కోసం సీట్లను కేటాయించామని తెలిపారు.
పూర్తి స్థాయిలో భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తే యూనివర్సిటీ శాశ్వత భవన నిర్మాణం చేపడుతామని కేంద్ర మంత్రి వెల్లడించాయిరు. ఈ యూనివర్సిటీలో గిరిజనుల ఆచార వ్యవహారాలు, జీవన విధానాలు, సాం ప్రదాయాలపై రీసెర్చ్ యూనిట్ ఉంటుందని చెప్పారు. ఎన్నికల అనంతరం శాశ్వత భవన నిర్మాణలకు ప్రధాని మోదీతో భూమి పూజ చేయిస్తామని చెప్పారు.
రామప్ప దేవాలయం ఈ ప్రాంతంలో ఉండడం ఎంతో గర్వకారణమని చెబుతూ యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని రూ.63 కోట్లతో అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. మం త్రి సీతక్క మాట్లాడుతూ ఈ ప్రాంతం ముఖ్యంగా టూరిజం హబ్‌గా మాత్రమే ఉందని, యూనివర్సిటీ ఏర్పడుతూ టూరిజంతో పాటు ఎడ్యుకేషన్ హబ్‌గా ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ములుగు జిల్లా, అనేక టూరిజం ప్రాంతాలతో ఉందని దేశం నలుమూలల నుండి సందర్శకులు, పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో వస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతంపై ఎక్కువ దృష్టి పెట్టి మరింత అభివృద్ధి చేయడం కోసం నిధులు మంజూరు చేయాలని ఆమె కోరారు. తద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని తెలిపారు.
More Stories
ప్రత్యేక దేశంగా పాలస్తీనా .. భారత్ సంపూర్ణ మద్దతు
నేపాల్ తొలి మహిళా ప్రధానిగా సుశీలా కర్కి
భారత్ లక్ష్యంగా కొత్త చట్టానికి ట్రంప్ ప్రతిపాదన