
తెలంగాణలో గత తొమ్మిదేళ్లలో దాదాపు రూ.30 వేల కోట్ల వ్యయంతో రైల్వే అభివృద్ధి పనులు చేశామని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. నగరంలోని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్ చుట్టూ త్వరలో ‘ ఔటర్ రింగ్ ’ రైలు రహదారిని నిర్మిస్తామని చెప్పారు. రైలు ప్రయాణాన్ని అత్యంత సౌకర్యవంతంగా, ప్రయాణీకులకు సౌకర్యాన్ని కల్పించే దిశలో ఔట్ రింగ్ రైలు ప్రాజెక్టుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు.
గురువారం కొమురవెల్లి (హాల్ట్) రైల్వే స్టేషన్ నిర్మాణానికి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. సిద్దిపేట జిల్లా ప్రజా పరిషత్ ఛైర్ పర్సన్ వి.రోజా రాధాకృష్ణ శర్మ, పార్లమెంటు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ , మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్ , మాజీ ఎంఎల్ఏ రఘునందన్ రావు , దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ , హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లోకేష్ విష్ణోయ్, ఇతర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొమురవెల్లి (హాల్ట్) స్టేషన్ వల్ల మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందేందుకు ప్రతిరోజూ కొమురవెల్లికి వచ్చే వేలాది మంది యాత్రికులకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పారు. కొమురవెల్లి స్టేషన్ మనోహరాబాద్ -కొత్తపల్లి నూతన రైల్వే లైన్ వస్తుందని, ఇటీవలే మన ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టులో కొంత భాగమైన మనోహరాబాద్ -సిద్దిపేటను జాతికి అంకితం చేశారని ఆయన తెలిపారు.
కాగా, తెలంగాణాలో సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లు తదితర 40 రైల్వేస్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అన్ని స్టేషన్లలో ఉచిత వైఫై సౌకర్యం కల్పిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రసంగిస్తూ భారతీయ రైల్వేలు సామాన్య ప్రజలకు ఎంతో కీలకమని, దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. భారతీయ రైల్వేలు దేశములోని దక్షిణం ఈశాన్య-తూర్పు – పశ్చిమ మొదలైన అన్ని ప్రాంతాలను, మధ్యప్రదేశ్ తో కలుపుతున్నాయని చెప్పారు. యాత్రికుల సౌకర్యార్థం కొమురవెల్లి స్టేషన్లో అన్ని అధునాతన వసతులు వేగవంతముగా నిర్మించబడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత