
ప్రధాని నరేంద్ర మోదీ ఓబీసీ కాదని, ఆయన జనరల్ క్యాటగిరీకి చెందినవారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ గురువారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడింది. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఒడిశాలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ గురువారం ఉదయం మాట్లాడుతూ ప్రధాని మోదీ తనను తాను ఓబిసికి చెందిన వ్యక్తిగా చెప్పుకుంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
దీనిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం `ప్రధాని కులంపై రాహుల్ గాంధీ ప్రకటనకు సంబంధించిన వాస్తవాలు’ అన్న శీర్షికతో ఒక నోట్ విడుదల చేసింది. సామాజికంగా విద్యాపరంగా వెనుకబడిన కులాలు, ఓబిసిల జాబితాలో మోధ్ ఘంచి కులాన్ని(ప్రధాని మోడీకి చెందిన ఉప కులంతోపాటు) గుజరాత్ ప్రభుత్వం చేర్చిందని ప్రభుత్వం వివరించింది.
గుజరాత్‌లో సర్వే చేసిన తర్వాత ఇండెక్స్ 91(ఎ) కింద మండల్ కమిషన్ ఓబిసిల జాబితాను తయారుచేసిందని, అందులో మోధ్ ఘంచి కులాన్ని చేర్చిందని ప్రభుత్వం తెలిపింది. గుజరాత్ కోసం భారత ప్రభుత్వం రూపొందించిన 105 ఓబిసి కులాల జాబితాలో మోధ్ ఘంచి కులాన్ని కూడా చేర్చిందని నోట్‌లో తెలిపింది. ఓబిసిల జాబితాలో ఉప కులాన్ని చేర్చుతూ 1994 జులై 25న నోటిఫికేషన్ జారీ అయిందని, ఆ సమయంలో మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ప్రభుత్వం తన నోట్‌లో రాహుల్ గాంధీకి గుర్తు చేసింది. 2000 ఏప్రిల్ 4న భారత ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్‌లో అదే ఉప కులాన్ని ఓబిసిల జాబితాలో చేర్చారని తెలిపింది. ఈ రెండు నోటిఫికేషన్లు వెలువడినపుడు నరేంద్ర మోదీ అధికారంలో లేరని, ఆ సమయాలలో ఆయన ప్రభుత్వ పదవుల్లో లేరని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ ఇలా స్ధాయి దిగజారి మాట్లాడతారా? అని బీజేపీ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు.
పేదలు, ఎస్సీ, ఎస్టీలు, బీసీలు నరేంద్ర మోదీని తమ నేతగా భావిస్తారని, కాంగ్రెస్ భవిష్యత్ అంధకారంలో ఉండటంతో రాహుల్ ఇలా మాట్లాడుతున్నారని, ఇది సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి కాబోయే రెండేండ్ల ముందే ఆయన కులాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీగా నోటిఫై చేసిందని బీజేపీ పేర్కొంది.
రాహుల్ గాంధీ అసత్యాలు చెబుతున్నారని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ ఆరోపించారు. 1999 అక్టోబర్ 27న ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహించే కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చారని ఆయన స్పష్టం చేశారు. ఆ మేరకు అప్పటి ప్రభుత్వ నోటిఫికేషన్ ను ఆయన విడుదల చేశారు. నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకూ నెహ్రూ-గాంధీ కుటుంబం ఓబీసీలకు వ్యతిరేకమని మాలవీయ కాంగ్రెస్ పార్టీపై మండిపడ్డారు.కాగా, ప్రధాని నరేంద్ర మోదీ కులంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాందీ అంతకుముందు అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా ఒడిషాలోని ఝార్సుగుడలో రాహుల్ మాట్లాడుతూ ప్రధాని మోదీ ఓబీసీ క్యాటగిరీలో జన్మించలేదని, గుజరాత్‌లోని తేలి కులంలో ఆయన జన్మించారని చెప్పారు.
2000 సంవత్సరంలో ఆ కులాన్ని బీజేపీ ఓబీసీ క్యాటగిరీలో చేర్చిందని పేర్కొంటూ మోదీ సాధారణ కులంలోనే జన్మించారని, స్వతహాగా ఓబీసీ కాదని రాహుల్ ఆరోపించారు. మోదీ ఓబీసీగా జన్మించనందునే ఆయన తన జీవితాంతం కులగణన నిర్వహించేందుకు అనుమతించరని అంటూ విమర్శించారు.
More Stories
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా
నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబులు
ఎల్టీటీఈ పునరుద్ధరణకు శ్రీలంక మహిళ ప్రయత్నం