
కొత్త పార్టీని పెడుతున్నట్లు తమిళ హీరో విజయ్ దళపతి ప్రకటించారు. తమిళగ వేట్రి కజగమ్ -టీవీపీ పేరుతో పార్టీని స్థాపిస్తున్నట్లు విజయ్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలోనే తమిళగ వేట్రి కజగమ్ పార్టీ నేతలు విజయ్‌ని పార్టీ అధినేతగా ఎన్నుకున్నారు. తమిళగ వేట్రి కజగమ్ అంటే తమిళనాడు విజయ పార్టీ అని అర్థం.
అయితే తాము 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడం లేదని విజయ్ స్పష్టం చేశారు. అంతే కాకుండా ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ప్రకటించేది లేదని తేల్చి చెప్పారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ జనరల్ అండ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్నట్లు విజయ్ తెలిపారు. తమిళగ వేట్రి కజగమ్ పార్టీ ముఖ్య ఉద్దేశం 2026 లో తమిళనాడులో జరిగే అసెంబ్లీ ఎన్నికలే అని ఈ నిర్ణయంతో స్పష్టం అవుతోంది.
విజయ్ పార్టీ పెట్టనున్నట్లు గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఆ దిశగానే విజయ్ చేసిన కొన్ని ప్రకటనలు, చేసిన పనులు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారనే వార్తలకు బలం చేకూర్చాయి. కానీ ఆయన మాత్రం ఎక్కడా బహిరంగంగా ప్రకటన చేయలేదు. ఈ క్రమంలోనే ఇటీవల తన అభిమానులు, సన్నిహితులు, ఇతర వర్గాల వారితో విజయ్ వరుస భేటీలు నిర్వహించిన నేపథ్యంలోనే రాజకీయాల్లోకి విజయ్ అరంగేట్రం చేస్తారనే వార్తలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ తాజాగా పార్టీ పేరును ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
ఇప్పటివరకు తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయాలని తాను నిర్ణయం తీసుకున్నట్లు విజయ్ వెల్లడించారు. అలా చేసినపుడే పార్టీ కార్యక్రమాల కోసం తన పూర్తి సమయాన్ని వెచ్చించే అవకాశం ఉంటుందని, రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తమిళగ వేట్రి కజగమ్ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావడం తమిళనాడు ప్రజలకు కృతజ్ఞతగా భావిస్తున్నానని తెలిపారు.
విజయ్‌కి చెందిన మక్కల్ ఇయ్యక్కం అభిమాన సంఘాన్నే రాజకీయ పార్టీగా మార్చినట్లు తెలుస్తోంది. దీనికి గుర్తింపు లభించేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి గతంలోనే దరఖాస్తు చేసుకున్నారు.
తమిళ సినిమాలో తర్వాతి రజినీకాంత్‌గా భావించే విజయ్ ఇప్పటివరకు 68 సినిమాల్లో నటించారు. అయితే గత దశాబ్ద కాలంగా రాజకీయాల్లోకి రావాలని విజయ్ భావించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందులో భాగంగానే పేదలకు ఉచిత భోజనం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, లైబ్రరీలు, ట్యూషన్లు, న్యాయ సహాయం వంటి అనేక స్వచ్ఛంద, సంక్షేమ కార్యక్రమాల్లో విజయ్ అభిమాన సంఘాలు పాల్గొంటున్నాయి.
More Stories
హిందుస్తానీ సంగీతకారుడు పండిట్ చన్నులాల్ మిశ్రా మృతి
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు