జార్ఖండ్‌ సీఎంగా చంపై సోరెన్‌ ప్రమాణం

జార్ఖండ్‌లో రాజకీయ హైడ్రామాకు తెరపడింది. అధికార జేఎంఎం కూటమి శాసనసభాపక్ష నేత చంపై సోరెన్‌ జార్ఖండ్‌ తదుపరి ముఖ్యమంత్రిగాబాధ్యతలు చేపట్టారు. శుక్రవారం రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా చంపై ప్రమాణం చేశారు. రాంచీలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ చంపైతో ప్రమాణ స్వీకారం చేయించారు.
 
ఈడీ అరెస్టు నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవికి జేఎంఎం నేత హేమంత్‌ సోరేన్‌ రాజీనామా చేసిన రెండు రోజుల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అధికార సంకీర్ణ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన చంపై సొరేన్‌  తాజాగా ముఖ్యమంత్రి పదవి చేపట్టారు.  హేమంత్ సోరెన్ బుధవారం రాజీనామా చేసినప్పటి నుంచి రాష్ట్రంలో గందరగోళం నెలకొందని, రాజకీయ సంక్షోభానికి కారణం కాకుండా వీలైనంత త్వరగా ప్రభుత్వ ఏర్పాటుకు తమ అభ్యర్థనను ఆమోదించాలని కోరడంతో గవర్నర్ సమ్మతించారు. చంపాయ్ సోరెన్‌ను ముఖ్యమంత్రి పదవికి నియమించారు. 
 
చంపాయ్ సోరెన్ తన ప్రభుత్వ మెజారిటీని నిరూపించుకోవడానికి 10 రోజుల సమయం ఇచ్చినట్లు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు  రాజేష్ ఠాకూర్ తెలిపారు.
67 ఏళ్ల గిరిజన నేత రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. తూర్పు సింగ్భూమ్, పశ్చిమ సింగ్భూమ్, సెరైకెలా-ఖర్సావన్ జిల్లాలతో కూడిన జార్ఖండ్లోని కొల్హాన్ ప్రాంతం నుంచి ఆయన ఆరో ముఖ్యమంత్రి.

కాంగ్రెస్ సీనియర్ నేత అలంగీర్ ఆలం, ఆర్జేడీ నేత సత్యానంద్ భోక్త కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చంపై సోరెన్ సరైకెలా-ఖర్సవాన్ జిల్లాలోని జిలింగ్గోడా గ్రామానికి చెందిన రైతు సిమల్ సోరెన్ పెద్ద కుమారుడు. 1956 నవంబర్ 1న ఝార్ఖండ్ లోని సరైకల ప్రాంతంలో జన్మించారు. ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి వరకు విద్యనభ్యసించారు. చిన్న వయసులోనే వివాహం చేసుకున్న ఆయనకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

కాగా, చంపై సోరెన్‌ జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ నుంచి సెరైకెలా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం కేబినెట్‌ మంత్రిగా హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ బాధ్యతలను బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  చంపయి ప్రస్తుతం జెఎంఎం పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు.
 
బీహార్ నుంచి ప్రత్యేక జార్ఖండ్ రాష్ట్రం కోసం డిమాండ్ వచ్చిన సమయంలో చంపై పేరు వార్తల్లో నిలిచింది. శిబు సోరెన్‌తో పాటు చంపై సైతం ప్రత్యేక జార్ఖండ్‌ ఉద్యమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ప్రజలు ఆయనను ‘జార్ఖండ్‌ టైగర్‌’గా పిలుస్తూ వస్తున్నారు. 1995లో తొలిసారిగా ఎంఎల్ఎగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 
 
ఆయన ఇప్పటికి ఏడు సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. అర్జున్ ముండా నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కూడా కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించారు. 2010 సెప్టెంబర్ 11 నుంచి 2013 జనవరి 18 వరకు మంత్రిగా పనిచేశారు.