రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఏకవచనంతో సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యల పట్ల కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్ క్షమాపణలు చెప్పారు. ఆదివారం చిత్రదుర్గలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన కన్నడ భాషలో మాట్లాడుతూ ద్రౌపది ముర్ముపై ఏకవచన సంబోధం చేశారు. దీన్ని బీజేపీ, జేడీఎస్ నేతలు తప్పుపట్టారు.
ప్రజలను కించపరిచే పాత అలవాటును సీఎం సిద్దరామయ్య మళ్లీ రిపీట్ చేసినట్లు ఆ పార్టీలు ఆరోపించాయి. దీంతో సోమవారం సీఎం సిద్ధరామయ్య తన ఎక్స్ అకౌంట్లో క్షమాపణలు చెబుతూ ఓ పోస్టు చేశారు. ఆదివారం సోషితారా జాగృతి సమవేశంలో ఆయన మాట్లాడుతూ అన్నీ చేస్తున్నట్లు చెప్పుకునే బీజేపీ పార్లమెంట్ కొత్త భవన ప్రారంభోత్సవం కోసం అణగారిన వర్గానికి చెందిన పేద ద్రౌపది ముర్మును ఆహ్వానించలేదని విమర్శించారు.
రాజ్యాంగానికి కస్టోడియన్‌గా ఉన్న ఆమెను ఆహ్వానించలేదని, రామాలయ ప్రారంభోత్సవానికి కూడా ఆమెను పిలవలేదని ధ్వజమెత్తారు. వాళ్ల మాత్రం తనను హిందూ వ్యతిరేకులమని చెబుతుంటారని, తాను ఎవరికీ వ్యతిరేకం కాదు అని, తాను మానవత్వం వైపు ఉన్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
సీఎం సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలను మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి తప్పుపట్టారు. సిద్దూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దేశ తొలి పౌరురాలిని ఏకవచనంతో సంబోధించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నైతిక కారణాలపై సీఎం తప్పుకోవాలని కోరారు.
అణగారిన వర్గానికి చెందిన గిరిజన మహిళను సిద్ధరామయ్య అవమానించినట్లు ఆరోపించారు. ఆయన ప్రవర్తన రాష్ట్రానికి మచ్చ అని, రాజ్యాంగానికి కూడా ఇది అవమానకరమని మండిపడ్డారు. సిద్దరామయ్య వ్యాఖ్యల ఆయన పార్టీ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని విజయపుర బీజేపీ ఎమ్మెల్యే పాటిల్ యాంతల్ ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న వారిని అవమానించడమే అని స్పష్టం చేశారు.
ఈ అంశంపై సిద్దరామయ్య తన ఎక్స్‌లో స్పందిస్తూ పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ముర్మును ఆహ్వానించక పోవడం తనను బాధపెట్టిందని, ఆ సమయంలో కొంత బావోద్వేగానికి లోనైనట్లు చెప్పారు. ఆ ఆవేశంలో రాష్ట్రపతిని ఏకవచనంతో సంబోధించినట్లు చెప్పారు. తన నోరు జారడం వల్ల అలా పలికినట్లు తెలిపారు.

More Stories
మెస్సి టూర్లో గందరగోళం.. అభిమానుల అసహనం
తిరువనంతపురంలో మొదటి బిజెపి మేయర్!
జన గణనకు రూ.11,718 కోట్లు