రాముడి ప్రతిష్ఠాపన భారత అంతర్మాతకు ప్రతిబింబం

రాముడి ప్రతిష్ఠాపన భారత అంతర్మాతకు ప్రతిబింబం

* ప్రధాని మోదీ, సీఎం యోగి ఆదిత్యనాథ్ భావోద్వేగం

‘దేశంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. రామ మందిర ప్రతిష్ఠాపన భారత అంతర్మాతకు ప్రతిబింబం. ఆ ఘట్టాన్ని చూడటం భారతీయులందరీ అదృష్టం’ అంటూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతోషం  వ్యక్తం చేశారు. ఈ పండుగ వాతావరణం ఈ దేశ గొప్పతనాన్ని చాటుతోందని ఆమె తెలిపారు.  బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని మోదీకి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వ్రాసిన రెండు పేజీల లేఖలోశ్రీరాముడి జీవితం అత్యంత ఆదర్శనీయమైనదని, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు.

అయోధ్యలో రామమందిరంలో బలరాముడు విగ్రహ ప్రాణప్రతిష్టకు బయలుదేరుతున్న ప్రధాని నరేంద్ర మోదీకి పంపిన సందేశంలో ఆమె ఆలయ ప్రారంభోత్సవం నాడు పండగ వాతావరణం నెలకొనడం, ప్రతి ఒక్కరూ రామనామ జపంతో తరించడ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా  దేశ ప్రజల తరఫున ప్రధానికి రాష్ట్రపతి శుభాకాంక్షలను తెలియజేశారు. 11 రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షను చేపట్టిన మోదీని అభినందించారు.

ఇదొక పవిత్రమైన ఆచారం మాత్రమే కాదని, గొప్ప ఆధ్యాత్మిక చర్యగా ఆమె అభివర్ణించారు. రాముని పట్ల ఆయనకు ఉన్న భక్తికి నిదర్శనం అని ఆ లేఖలో ముర్ము పేర్కొన్నారు. సమన్యాయం, యావత్ దేశ ప్రజల సంక్షేమంపై శ్రీరాముడి ఆశీర్వాదం ఉంటుందని ముర్ము కొనియాడారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ ప్రేమగా, సగౌరవంగా చూడాలనే శ్రీరాముడి సందేశాన్ని ఆచరిస్తారని ఆమె పేర్కొన్నారు.

జాతిపిత మహాత్మాగాంధీ చివరి వరకూ సామాజిక న్యాయమే లక్ష్యంగా జీవించారని, రామనామ జపంతో గడిపారని రాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా, అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతోన్న వేళ ప్రధాని మోదీ భావొద్వేగానికి గురయ్యారు. ‘బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠతో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని పెంపొందిస్తుంది. భారతదేశం మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుతుంది అని’ ప్రధాని మోదీ అభిప్రాయ పడ్డారు.

అద్భుతమైన, మరపురాని, అతీంద్రియ క్షణం
 
రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠకు ముందు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన గురువులను స్మరించుకుని, పూజలు చేశారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్‌’లో ఇది అద్భుతమైన, మరపురాని, అతీంద్రియ క్షణం.. అయోధ్యధామ్‌లోని శ్రీరాముడి జన్మస్థలంలో నేడు జరుగుతున్న రామ్‌లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం శతాబ్ధాల పోరాట ఫలితం అంటూ భావోద్వేగం వ్యక్తం చేశారు. 
 
“ఈరోజు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమక్షంలో శ్రీరాముని పవిత్ర జన్మస్థలమైన అయోధ్యధామ్‌లో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరగనుంది. నేడు ప్రధాని నేతృత్వంలో అసంఖ్యాక రామభక్తుల నిరీక్షణకు తెరపడనుంది. భక్తి సాగరంలో మునిగిన దేశమంతా రామనామం స్మరిస్తోందని, ఈ సందర్భంగా దిగ్విజయ్‌నాథ్ మహరాజ్, మహంత్ అవేద్యనాథ్ మహారాజ్‌లకు ఉద్వేగభరితమైన నివాళులు అర్పిస్తున్నాను.. జై జై శ్రీ రామ్!’”అని రాశారు.