తిరుచిరాపల్లిలో శ్రీ రంగనాథస్వామిని దర్శించుకున్న మోదీ

తిరుచిరాపల్లిలో శ్రీ రంగనాథస్వామిని దర్శించుకున్న మోదీ
తమిళనాడులో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ శనివారం  ముందుగా ఆయన తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకంటే ముందు ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణంలో ఉన్న గజరాజు ఆశీస్సులు తీసుకున్నారు.
 
తమిళనాడులోని తిరుచి సమీపంలో ఉన్న శ్రీరంగం క్షేత్రం రామాయణంతో ముడిపడి ఉంది.  తెల్లని ధోవతి, అంగవస్త్రం ధరించి ఆలయంలోకి ప్రవేశించిన ప్రధాని మోదీ శ్రీ మహావిష్ణు రూపమైన రంగనాథ స్వామివారిని కొద్దిసేపు ప్రార్థించారు.  దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణంలో కంబ రామాయణ శ్రవణం చేశారు.
 
ఆలయానికి వచ్చిన ప్రధానికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేదమంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. ఈ వారంలోనే దక్షిణాదిలో రామాయణంతో సంబంధమున్న సందర్శించిన మూడవ ఆలయమిది. ఈ వారం మొదట్లో ఆయన ఆంధ్రపద్రేశ్‌లోని లేపాక్షిలో ఉన్న శ్రీ వీరభద్ర ఆలయాన్ని సందర్శించారు. రాయాణంలోని జటాయువు వృత్తాంతంతో సంబంధమున్న ఆలయమది.
 
 ఆ తర్వాత ఆయన కేరళలోని త్రిసూర్‌లో శ్రీ రామస్వామి ఆలయాన్ని దర్శించారు. శ్రీరాముడు, ఆయన సోదరులు ఈ ఆలయాన్ని సందర్శించినట్లు ప్రతీతి. ఆలయ ప్రాంగణంలోని వైష్ణవ మత గురువు శ్రీ రామానుజార్యులు, చక్రత్తాళ్వార్‌తోసహా ఇతర దేవతామూర్తుల సన్నిధులను ప్రధాని దర్శించారు.  కాగా, ప్రధాని మోదీ రాక సంద‌ర్భంగా శ్రీరంగం ఆల‌యాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా అలంక‌రించారు. శ్రీరంగాన్ని భూలోక వైకుంఠంగా భావిస్తారు. కాగా, జ‌న‌వ‌రి 22వ తేదీన అయోధ్యలో రామాల‌యం ప్రారంభోత్సవం సంద‌ర్భంగా ప్రధాని మోదీ ప‌లు రాష్ట్రాల్లో ఉన్న ప్రధాన ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తున్నారు. శనివారం ఉదయం తమిళనాడు రాజధాని చెన్నైలోని రాజ్‌భవన్‌కు వెళ్లి,  అక్కడ గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవిని కలిశారు. అనంతరం రాజ్‌భవన్‌ ప్రాంగణంలో గవర్నర్‌తో కలిసి రుద్రాక్ష మొక్కను నాటారు.