నెలాఖ‌రులోగా ఫాస్టాగ్ ఈ-కేవైసీ చేయాలి

నెలాఖ‌రులోగా ఫాస్టాగ్ ఈ-కేవైసీ చేయాలి
జాతీయ రహదారులపై వెళుతున్నప్పుడు టోల్ గేట్ల వద్ద టోల్ ఫీజు  చెల్లింపునకు ఫాస్టాగ్ పేమెంట్స్ అమల్లోకి తేవడంతో ట్రాఫిక్ జామ్ లు తగ్గి ప్రయాణాలు సులభంగా మారాయి.  కొన్న కొత్త కారు, మీ మొబైల్ నంబర్ వాటితో అనుసంధానమైన బ్యాంక్ ఖాతా కలిపి ఫాస్టాగ్ కోడ్ వస్తుంది. అది టోల్ గేట్ వద్ద స్కాన్ చేస్తే బ్యాంకు ఖాతా నుంచి టోల్ ఫీజు ఆటోమేటిక్ పేమెంట్ అవుతుంది.

అయితే, ఎప్పటికప్పుడు ఫాస్టాగ్ అప్ డేట్ చేసుకోవడానికి ఈ-కేవైసీ సమర్పించాల్సి ఉంటుందని జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) స్పష్టం చేసింది. ఒకవేళ ఫాస్టాగ్ యూజర్లు తమ బ్యాంకు ఖాతాలతో ఈ-కేవైసీ అప్ డేట్ చేసుకోకపోతే సదరు ఫాస్టాగ్ ఖాతాను వారి బ్యాంక్ డీయాక్టివేట్ చేస్తుంది. 

అలా డీ యాక్టివేట్ చేయకుండా ఉండాలంటే ఈ నెలాఖరులోగా తమ బ్యాంకు ఖాతాలో ఈ-కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. ఫాస్టాగ్ యూజర్లు ‘వన్ వెహికల్- వన్ ఫాస్టాగ్’ సూత్రానికి కట్టుబడి ఉండాలన్న నిబంధనను జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) సూచించింది. 

ఒకే ఫాస్టాగ్ మీద ఒకటి కంటే ఎక్కువ వాహనాలను వాడొద్దని స్పష్టం చేసింది. వాహనాల యజమానులు ఒకే ఫాస్టాగ్‌తో పలు వాహనాల టోల్ ఫీజు, ఒక్క వాహనానికి ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్‌లు వాడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని నివారించడానికి ఒకే వాహనం- ఒకే ఫాస్టాగ్ నిబంధన తెచ్చింది. 

కొందరు యూజర్లు ఫాస్టాగ్‌లను విండ్ స్క్రీన్లపై సరిగ్గా అతికించడం లేదని, ఇది జాప్యానికి దారి తీస్తున్నదని ఎన్‌హెచ్ఏఐ పేర్కొంది. కనుక టోల్ ప్లాజాల వద్ద అసౌకర్యాన్ని నివారించేందుకు కార్ల యజమానులు సమీపంలోని టోల్ ప్లాజాల వద్దకు వెళ్లాలని, టోల్ ప్లాజా టోల్ ఫ్రీ నంబర్, బ్యాంకుల కస్టమర్ కేర్ కేంద్రాలను సంప్రదించాలని ఎన్‌హెచ్ఏఐ సూచించింది.