
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 600కు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకూ 24 గంటల వ్యవధిలో 602 కరోనా కేసులు బయటపడ్డాయి.
తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 4,440కి చేరింది. ఇక నిన్న ఒక్కరోజే 5 మరణాలు నమోదయ్యాయి. దీంతో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,33,371కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకూ 4,44,77,272 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా.. భారత్లో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 చాపకిందనీరులా విస్తరిస్తోంది.
దేశంలో ఈ తరహా కేసులు తాజాగా 200 దాటాయి. ఇప్పటి వరకూ జేఎన్.1 కేసులు 263కు చేరినట్లు ఇండియన్ సార్స్ కోవ్ 2 జెనోమిక్స్ కన్సార్టియం మంగళవారం వెల్లడించింది. పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ విస్తరించిందని పేర్కొంది. ఇక ఈ తరహా కేసులు కేరళలోనే అత్యధికంగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
కేరళలో ఏకంగా 133 జేఎన్.1 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత గోవాలో 51, గుజరాత్లో 34, ఢిల్లీలో 16, కర్ణాటకలో 8, మహారాష్ట్రలో 9, రాజస్థాన్లో 5, తమిళనాడులో 4, తెలంగాణలో 2, ఒడిశాలో 1 కేసు నమోదైనట్లు వెల్లడించింది. మొత్తం కేసుల్లో 239 కేసులు డిసెంబర్లో వెలుగు చూడగా.. 24 కేసులు నవంబర్ నెలలో బయటపడినట్లు ఇన్సాకాగ్ వివరించింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్