ఎయిర్‌పోర్ట్ మెట్రో, ఫార్మాసిటీ రద్దు కాలేదు

ఎయిర్‌పోర్ట్ మెట్రో, ఫార్మాసిటీ రద్దు కాలేదు
హైదరాబాద్ లో నిర్మించతలపెట్టిన ఎయిర్ పోర్ట్ మెట్రో కానీ, ఫార్మాసిటీ కానీ రద్దు చెయ్యడం లేదని.. సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మీడియాతో చిట్ చాట్ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మెట్రోను స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని తెలిపారు. బీహెచ్ఈఎల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు 32 కిలోమీటర్లు కాగా.. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో ఉంటుందన్నారు.
నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఒవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణ గుట్ట వద్ద ఎయిర్ పోర్టుకి వెళ్లే మెట్రో లైన్ కి లింక్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రపురం వరకు మెట్రో పొడిగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రో ని ఫైనాన్సిల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగిస్తామన్నారు. ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ఫార్మాసిటీని అంచలంచలుగా అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. వీటి కోసం ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటవుతాయని.. అక్కడి పరిశ్రమల్లో పని చేసే వాళ్ళకి అక్కడే గృహనిర్మాణాలు కూడా చేస్తామని వివరించారు.
యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన.. పేరున్న పారిశ్రామిక వేత్తల ద్వారా శిక్షణ ఇప్పిస్తామని అన్నారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ వీటికీ ఉంటాయని.. అక్కడి నుంచి బయటకు వెళ్లిన వారికి క్యాంపస్ లోనే ఎంపిక ఉంటుందని వెల్లడించారు. 100 బెడ్స్ ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని.. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని.. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తామని చెప్పారు.
ఇటు పదవుల పంపకం పై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ నెల 3 వ తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పార్టీ కార్యకర్తలకు పదవులు ఇస్తామని స్పష్టం చేశారు. పార్టీ కోసం పనిచేసిన వారితోనే నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామన్నారు. ఈ సందర్భగా తాను ఏది చేసినా విస్తృత స్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే చేస్తానని.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. పార్టీ కోసం పని చేసిన వారికీ పదవులు ఇస్తామన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని సీఎం రేవంత్ పేర్కొన్నారు.