
ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో కూడా అధికారం చేపట్టడంలో విఫలమైన కాంగ్రెస్ ప్రతిపక్ష కూటమి `ఇండియా’లో ఇరకాట పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. మూడున్నర నెలల అనంతరం మంగళవారం ఢిల్లీలో జరిగిన భేటీలో నేరుగా ప్రధాన మంత్రి అభ్యర్ధికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రతిపాదించడంతో కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడింది.
ఖర్గే దళిత సామాజిక వర్గానికి చెందిన కీలక నేత కావడంతో కావడంతో ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే కూటమికి మంచి మద్దతు రాగలదని మమతా చేసిన ప్రతిపాదనకు అఖిలేష్ తో పాటు 12 పార్టీల నేతలు మద్దతు ప్రకటించారని తెలుస్తున్నది. ఈ ప్రతిపాదనను ఖర్గే సున్నితంగా తిరస్కరించినప్పటికీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాయకత్వంపై తమ అయిష్టాన్ని పరోక్షంగా వ్యక్తం చేసేందుకే ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
వాస్తవంగా, ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిత్వంపై లోక్‌సభ ఎన్నికల తర్వాతే నిర్ణయిస్తామని మమతా చెబుతూ వస్తున్నారు. అయితే, ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలలో కనీసం మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగితే ఇండియా కూటమిలో రాహుల్ గాంధీ తిరుగులేని నాయకుడిగా కాగలరని ఆలోచనలతో ఇప్పటి వరకు కూటమి భేటీలు లేకుండా కాంగ్రెస్ వాయిదా వేస్తూ వస్తున్నది.
అంతేకాకుండా, ఓ నెలరోజుల లోగా భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పూర్తి కావాలని ముంబై భేటీలో నిర్ణయించినా ఆ విషయంలో కాంగ్రెస్ ధోరణి కారణంగానే ముందుకు వెళ్లలేకపోయామనే విమర్శలు చెలరేగాయి. ఇతర పార్టీలతో కాంగ్రెస్ సర్దుబాటు ధోరణులు ప్రదర్శించకుండా ఒంటెత్తు పోకడలతో వెళ్లిన కారణంగానే ఉత్తరాదిన మూడు రాష్ట్రాలలో ఓటమి చవిచూసిన్నట్లు అఖిలేష్ యాదవ్, మమతా బహిరంగంగానే వాఖ్యానించడం గమనార్హం.
రాష్ట్రపతి ఎన్నికల సమయంలో షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన రామ్‌నాథ్ కోవింద్, ద్రౌపది ముర్ములపై అభ్యర్థిని నిలబెట్టినందుకు అధికార బీజేపీ నుంచి ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాయి. కాంగ్రెస్, ఇతర పార్టీలు దళితులు, గిరిజనులకు వ్యతిరేకమని బీజేపీ ఆరోపించింది. ఈ నేపథ్యంలో బీజేపీకి చెక్ పెట్టేందుకు ఖర్గే పేరును మమతా వ్యూహాత్మకంగా ప్రతిపాదించారు.
అయితే, ఆ విధంగా చేయడం అంటే అవకాశం వచ్చినా ప్రధాని పదవి చేపట్టకుండా రాహుల్ గాంధీని కట్టడి చేసే వ్యుహంగానే కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. సంఖ్యా బలం లేకుండా ప్రధాని అభ్యర్థిని నిర్ణయించడం సరికాదంటూ ఖర్గే ఈ విషయమై చర్చకు అవకాశం లేకుండా చేసిన్నట్లు చెబుతున్నారు. ముందు గెలిచిన తర్వాత ప్రధాని ఎవరన్నది నిర్ణయిద్దామని చెప్పినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో గెలవాలని, ఎంపీల సంఖ్యను పెంచుకోవాలని హితవు చెప్పారు.
ఇలా ఉండగా, ఇండియా కూటమి ఏర్పాటైన ఆరు నెలల తర్వాత మొదటి సారిగా ఉమ్మడిగా ఆందోళన కార్యక్రమానికి ఈ భేటీ పిలుపిచ్చింది. పార్లమెంట్లో విపక్ష సభ్యుల బహిష్కరణకు నిరసనగా ఈ నెల 22న దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
అదే విధంగా సీట్ల సర్దుబాటు అంశంపై కూడా చర్చించినట్టు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. డిసెంబరు చివరి నాటికి కొలిక్కి వస్తుందని ఆయన చెప్పారు. డిసెంబరు 31కి సీట్ల పంపకాలపై నిర్ణయం తీసుకోనున్నామని తెలిపారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఎన్‌సిపి అధ్యక్షుడు శరద్ పవార్, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, శివసేన (యుటిబి) ఉద్ధవ్ థాకరే తదితరులు కూడా భేటీకి హాజరయ్యారు.
నితీష్ పోస్టర్ల కలకలం
ఇలా ఉండగా, ఈ భేటీ సందర్భంగా జాతీయ రాజకీయాలలో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు మరింత పెద్ద పాత్ర ఇవ్వాలని కోరుతూ రాజధాని నగర వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ప్రతిపక్ష ఇండియా కూటమి కీలక సమావేశంలో పాల్గొనేందుకు నితీశ్ కుమార్ ఢిల్లీ వెళ్లిన రోజే ఈ పరిణామం చోటు చేసుకోవడంతో కలకలంరేపింది.
అయితే పోస్టర్లతో తమకు ఎటువంటి సంబంధం లేదని నితీశ్ సారథ్యంలోని జెడి(యు) వెంటనే వివరణ ఇచ్చింది. సొంత ప్రయోజనాలను ఆశించకుండా ప్రతిపక్ష ఐక్యత కోసమే తాను కృషి చేస్తున్నానని నితీశ్ చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో ఈ పోస్టర్ల వల్ల తమ నాయకుడికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని జెడి(యు) ఆందోళన చెందుతోంది.
పొత్తులకై కాంగ్రెస్ కమిటీ
మరోవంక, ఇతర పార్టీలతో పొత్తులపై చర్చలు జరిపేందుకు వీలుగా ఐదుగురు సభ్యులతో కాంగ్రెస్ మంగళవారం నేషనల్ అలియన్స్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి కాంగ్రెస్ సీనియర్ నేత ముకుల్ వాస్నిక్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఈ కమిటీలో రాజస్థాన్ మాజీ సిఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్‌గఢ్ మాజీ సిఎం భూపేష్ బఘేల్, మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షీద్, సీనియర్ నేత మోహన్ ప్రకాష్ సభ్యులుగా ఉంటారు
More Stories
గాంధీజీ శాంతి, సహనం, సత్యం సందేశం మానవాళికి ప్రేరణ
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
సుంకాల యుద్ధం మధ్య స్వదేశీ, స్వావలంబనలకై భగవత్ పిలుపు