అనారోగ్యంతో కువైట్‌ రాజు షేక్‌ నవాఫ్‌ కన్నుమూత

అనారోగ్యంతో కువైట్‌ రాజు షేక్‌ నవాఫ్‌ కన్నుమూత
మిడిల్ ఈస్ట్‌లో అత్యంత ధనిక, చమురు సంపన్నమైన కువైట్ దేశపు రాజు షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-సబా ఇకలేరు. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. స్వయంగా రాయల్ కోర్టు ఈ విషయాన్ని తెలిపింది. మూడేళ్లుగా అధికారంలో ఉన్న 86 ఏళ్ల షేక్ నవాఫ్ మరణించడంపై విచారం వ్యక్తంచేస్తూ, సంతాపం తెలుపుతూ కువైట్ ప్రభుత్వం టీవీలో ఒక ప్రకటన విడుదల చేసింది.

నవంబర్ నెలలో షేక్ నవాఫ్ అనారోగ్యానికి గురికావడంతో ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్నా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. కాగా, ప్రస్తుతం రాజు చనిపోవడంతో క్రౌన్ ప్రిన్స్‌గా ఉన్న షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-సబా ఇప్పుడు కువైట్‌కు రాజు అయ్యారు. ఈ విషయాన్ని కూడా కువైట్ స్టేట్ టెలివిజన్ ప్రకటించింది. 

ప్రస్తుతం షేక్‌ మిషాల్‌ వయసు 83 ఏళ్లు. కువైట్ దేశంలో అధికారం అల్ సబా కుటుంబం చేతిలోనే ఉంటూ వస్తున్నది. కాగా, 1937లో జన్మించిన షేక్ నవాఫ్ 1921 నుంచి 1950 వరకు కువైట్ రాజుగా ఉన్న షేక్ అహ్మద్ అల్-జాబర్ అల్-సబాకు 5వ కుమారుడు.  తన 25వ ఏటనే ఆయన హవల్లీ ప్రావిన్స్ గవర్నర్‌గా విధులు నిర్వహించారు. 1978 వరకు ఓ దశాబ్దం పాటు అంతర్గత వ్యవహారాల మంత్రిగా పనిచేశారు. షేక్ నవాఫ్ 2006లో అతని సవతి సోదరుడు షేక్ సబా అల్-అహ్మద్ అల్-సబా చేత యువరాజుగా ఎంపికయ్యారు.

2020లో 91 ఏళ్ల వయసులో షేక్ సబా మరణించడంతో షేక్ నవాఫ్ కువైట్ రాజుగా బాధ్యతలు చేపట్టారు. 2020లో చమురు ధరల పతనం కారణంగా కువైట్‌లో ఏర్పడిన సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించారు. రాజకీయ వివాదాలకు దూరంగా ఉన్నారు.  కువైట్ సంక్షేమ వ్యవస్థను పూర్తిగా మార్చేశారు. కువైట్‌లో క్షమాభిక్ష డిక్రీ ఆయన హయాం లోనే జారీ అయింది. చమురు నిల్వలు సమృద్ధిగా ఉన్న ప్రపంచం మొత్తం మీద ఆరోదేశంగా ప్రాముఖ్యత సాధించింది. 1991 గల్ఫ్ యుద్ధ నుంచి అమెరికాకు బలమైన స్నేహితునిగా ఉంటోంది.