
ఒక వంక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధికార పార్టీ పట్ల బహిరంగంగానే అసంతృత్తి వ్యక్తం చేస్తూ, పార్టీ బాధ్యతలకు దూరంగా ఉంటూ వస్తుండగా, ముఖ్యమంత్రికి సన్నిహితుడిగా భావిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాజాగా వైఎస్సార్సీపీకి షాకిచ్చారు.
ఎమ్మెల్యే పదవితో పాటుగా పార్టీకి రాజీనామా చేశారు. స్పీకర్‌కు తన రాజీనామా లేఖను పంపారు. అలాగే పార్టీకి రాజీనామా చేసిన లేఖను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపారు. స్పీకర్‌కు పంపిన లేఖలో ఎలాంటి కారణాలను ప్రస్తావించలేదు. కేవలం పదవికి రాజీనామా చేసినట్లు మాత్రమే చెప్పారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నానని లేఖలో ఆళ్ల పేర్కొన్నారు.
మంగళగిరి నియోజకవర్గానికి నిధులు ఇవ్వడం లేదని కొంతకాలంగా అసంతృప్తితో ఆళ్ల ఉన్నారు. అలాగే రూ.1250 కోట్లు నిధులు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని కూడా ఆగ్రహంతో ఉన్నారు. తనను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆళ్ల రామకృష్ణా రెడ్డి భావిస్తున్నారు. ఈ కారణాలతోనే ఆళ్ల రాజీనామా చేశారని అనుచరులు చెబుతున్నారు.
మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఇటీవలి కాలంలో తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఇటీవల పోటాపోటీగా కార్యాలయాలు సైతం ప్రారంభించారు. అయితే నియోజకవర్గంలో మొత్తం రెండు, మూడు గ్రూపులు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. టీడీపీ నుంచి వచ్చి గంజి చిరంజీవి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే కాండ్రు కమల, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి.
దొంతి వేమారెడ్డి కూడా నియోజకవర్గంలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వారికి పార్టీ అధిష్టానంలో కీలక నాయకుల నుండి మడ్దతు లభిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా, మంగళగిరి తాడేపల్లి నగర అధ్యక్షుడు దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ పేరుతో కార్యాలయం ఏర్పాటు చేశారు. ఇప్పటికే మంగళగిరిలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం ఉండగా వేమారెడ్డి కార్యాలయం ప్రారంభించడం వివాదాస్పదంగా మారింది.
ఇక ఆ తరువాత కూడా విభేదాలను సమసిపోయేలా చేసేందుకు సీఎం జగన్ ఏమాత్రం ప్రయత్నించలేదు సరికదా ఆళ్లను దూరం పెడుతూ వచ్చారు. ఆ విభేదాలన్నీ పెరిగిపోయి చివరకు ఆయన రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతుంది. 2019 ఎన్నికల ప్రచారం సందర్భంగా రామకృష్ణారెడ్డిని ఓటర్లు గెలిపిస్తే తాను మంత్రిగా చేస్తానని స్వయంగా సీఎం జగన్ ప్రకటించారు.
అయితే మంత్రి పదవి ఇవ్వకపోగా, తన వ్యతిరేకులకు ప్రభుత్వంలో ప్రాధాన్యత లభిస్తూ ఉండటం పట్ల అసంతృత్తితో కొంతకాలంగా పార్టీ కార్యక్రమాల పట్ల అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అమరావతి భూముల వివాదంలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా కోర్టులలో కేసులు వేసి, గత ప్రభుత్వంపై అవినీతి కేసుల నమోదుకు వీలుగా ప్రభుత్వానికి ఫిర్యాదులు చేసిన రామకృష్ణారెడ్డి కావడం గమనార్హం.
More Stories
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం
దేవరగట్టు కర్రల సమరంలో ఇద్దరు మృతి