
హమాస్ ఉగ్రవాద సంస్థగా ప్రకటించే ప్రశ్నతో కూడిన ఏ పేపర్‌పైనా తాను సంతకం చేయలేదని కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి శనివారం స్పష్టం చేశారు. భారత్ హమాస్‌ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించే యోచనలో ఉందా? అనే స్టార్ గుర్తు లేని ప్రశ్నతో కూడిన పేపర్‌పై లేఖి సమాధానం ఇచ్చినట్టుగా సోషల్‌మీడియలో వార్తలొచ్చాయి.
ఈ వార్తలపై ప్రస్తుతం విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా ఉన్న లేఖి స్పందించింది. సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఆమె పోస్టు చేశారు. ‘ఈ అంశంపై విదేశాంగ మంత్రి స్పష్టత ఇస్తారు. ఇందులో సాంకేతిక లోపం ఉన్నట్లు తెలుస్తోంది. మీకు తప్పుడు సమాచారం అందింది. ఈ ప్రశ్నతో ఉన్న ఏ పేపర్‌పై నేను సంతకం చేయలేదు.’ అని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
ఈ పోస్టుకి విదేశాంగ శాఖ ఎస్. జైశంకర్, ప్రధాన మంత్రి కార్యాలయాన్ని ట్యాగ్ చేశారు. ఇక లేఖి స్పష్టతపై శివసేన (యుబిటి) ఎంపి ప్రియాంక చతుర్వేది స్పందించారు. ‘ఆమె సంతకం ఫోర్జరి జరిగి ఉంటుందని ఆమె అనుకుంటున్నారా? ఇలా జరిగితే తీవ్ర స్థాయి నిబంధనల ఉల్లంఘనే. దీనిపై ఆమె నుంచి స్పష్టత వస్తే మేం సంతోషిస్తాం’ అని ఆమె తెలిపారు.
అయితే, ఆ ప్రశ్నకు జవాబుపై సంతకం చేసింది మీనాక్షి లేఖి కాదని, మరో విదేశాంగ సహాయ మంత్రి వి మురళీధరన్ అంటూ ఆ జవాబుకు `సాంకేతిక సవరణ’ అవసరమని గుర్తించామని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆ తర్వాత కొద్దిసేపటికే ఓ ప్రకటనలో వివరణ ఇచ్చింది. అయితే, లేఖి జవాబు ఇచ్చినట్లు లోక్ సభ వెబ్ సైట్ లో పొరపాటున పేర్కొన్నారు.
“ఏ సంస్థనైనా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడం అనేడిది చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం ప్రకారం సంబంధింత ప్రభుత్వ శాఖ జరుపుతోంది” అని జవాబులో తెలిపారు.
కాగా, హమాస్‌ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించే ప్రతిపాదనలో ఉందా? అనే దానిపై కాంగ్రెస్ ఎంపి కుంబకుడి సుధాకరన్ ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో హమాస్‌ని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్ రాయబారి భారత్‌ను అభ్యర్థించారు. అయితే ఇజ్రాయెల్ రాయబారి అభ్యర్థనపై భారత్ ఇప్పటివరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
హమాస్, ఇజ్రాయెల్ పోరు వల్ల పరిస్థితులు మరింత దిగజారుతుండడంపై ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను కేవలం శాంతి యుత మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిస్తోంది.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్‌గా అర్షదీప్