
తాను పదవిలో ఉన్నప్పుడు భారత్‌తో సత్సంబంధాలను తాను కోరుకున్నానని పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. అయితే కార్గిల్ దురాక్రమణ ప్లాన్‌ను వ్యతిరేకించినందుకు నాటి జనరల్ పర్వేజ్ ముషారఫ్ తన ప్రభుత్వాన్ని పడగొట్టారని ఆయన ఆరోపించారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ చీఫ్ అయిన నవాజ్ షరీష్, వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు ఆశించే వారితో శనివారం సమావేశమై ప్రతిసారీ తనను ప్రధాని పదవి నుండి ఎందుకు తొలగించారో తాను తెలుసుకోవాలనుకుంటున్నట్లు భావోద్వేగంతో చెప్పారు.
‘1993, 1999లో నన్ను ఎందుకు తొలగించాలో చెప్పాలి. అలా జరుగకూడదని (దేశం నాశనం కాకూడదని) కార్గిల్ ప్రణాళికను వ్యతిరేకించినప్పుడు (జనరల్ పర్వేజ్ ముషారఫ్) నన్ను తొలగించారు. ఆ తర్వాత నేను చెప్పింది నిజమని నిరూపితమైంది’ అని నవాజ్ షరీఫ్ తెలిపారు.
కాగా, తమ ప్రభుత్వం అన్ని రంగాల్లో బాగా పనిచేసిందని మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తెలిపారు. తాను ప్రధానిగా ఉన్న సమయంలో ఇద్దరు భారత ప్రధానులు పాకిస్థాన్‌లో పర్యటించారని తెలిపారు. వాజ్‌పేయి, మోదీ లాహోర్ వచ్చారని గుర్తు చేశారు. భారత్‌తోపాటు పొరుగు దేశాలతో సంబంధాలను పాకిస్థాన్ మెరుగుపర్చుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు.
‘భారత్, ఆఫ్ఘనిస్థాన్, ఇరాన్‌తో మన సంబంధాలను మెరుగుపర్చుకోవాలి. చైనాతో మరింత పటిష్టమైన సంబంధాలను ఏర్పరచుకోవాలి’ అని తెలిపారు. పొరుగు దేశాలతో తగువులాడుకొంటూ ఏవిధంగా పాకిస్థాన్ అంతర్జాతీయంగా గుర్తింపు పొందగలదని షరీఫ్ ప్రశ్నించారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ హయంలో పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారిందని విమర్శించారు. ఆర్థిక వృద్ధిలో పొరుగు దేశాల కంటే పాక్ బాగా వెనకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఏ ప్రభుత్వమైనా కేవలం ఆర్ధిక వ్యవహారాలు, ఆర్థికాభివృద్ధి పైననే దృష్టి సారించకుండా అన్ని రంగాలపై దృష్టి సారించాలని తెలిపారు.
చైనా – పాకిస్తాన్ ఆర్ధిక కారిడార్ ప్రాజెక్ ను పిటిఐ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు. బొగ్గు నిల్వలను ఉపయోగించుకోవడం గురించి మాటలే గాని చేతలు కానరాలేదని ధ్వజమెత్తారు. 2013 నుండి 2018 వరకు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశ ఆర్ధిక వ్యవస్థ పురోగమనంలో ఉండేదని గుర్తు చేశారు.
మరోవైపు 2017లో తన ప్రభుత్వాన్ని గద్దె దింపడం ద్వారా దేశాన్ని నాశనం చేసిన మాజీ మిలిటరీ జనరల్స్, న్యాయమూర్తులను బాధ్యులుగా చేయాలన్న తన డిమాండ్‌ను నవాజ్ షరీఫ్ పునరుద్ఘాటించారు.
‘దేశభక్తులు తమ దేశాన్ని ఇలా చేయలేరు. కాబట్టి ఈ దేశాన్ని ఈ స్థాయికి తీసుకువచ్చిన వారు జవాబుదారీగా ఉండాలి. విలాసవంతమైన కార్లలో తిరిగేందుకు అధికారంలోకి రావాలని మేం కోరుకోవడం లేదు. కానీ ఈ దేశాన్ని నాశనం చేసి, మాపై తప్పుడు కేసులు బనాయించిన వారి నుంచి జవాబుదారీతనం కావాలి’ అని ఆయన తేల్చి చెప్పారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు