
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డిఎ) 145వ బ్యాచ్ కవాతు గురువారం కనులపండువగా జరిగింది. పుణేలోని కడక్వాస్లాలో జరిగిన కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ అతిధిగా హాజరయ్యి, ఈ కవాతును ఆసక్తితో వీక్షించారు. ఈసారి జరిగిన పరేడ్లో తొలి మహిళా క్యాడెట్ల బృందం కూడా పాల్గొంది. వీరికి రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ పరేడ్ చారిత్రకం అని, ఈ సారి తొలిసారిగా యువతుల దళం ఇందులో పాల్గొనడం వారి స్థయిర్యానికి ప్రతీక అయిందని ఆమె కొనియాడారు. సైనిక బలగాలలో సేవలను అందించేందుకు మహిళలు ముందుకు వచ్చారని, ఎంతటి క్లిష్టతరమైన వృత్తి అయినా దీనిని వారు ఏరికోరి ఎంచుకోవడం, శిక్షణ పూర్తి చేసుకోవడం అభినందనీయం అని రాష్ట్రపతి తెలిపారు.
పురుషులతో కలిసి దాదాపు 15 మంది మహిళా క్యాడెట్లు ఈ కవాతులో పాల్గొనడం అత్యంత ఆకర్షణీయం అయింది. వినూత్న శక్తివంతంగా మారింది. గత ఏడాది పుణే డిఫెన్స్ అకాడమీలో తొలి మహిళా బ్యాచ్ చేరింది. దేశంలోని త్రివిధ సైనిక బలగాలకు అత్యుత్తమైన సైనికాధికారులను ఎన్డిఎ వరుసగా అందిస్తోంది.
ఈ అకాడమీలో మూడేళ్ల సైనిక శిక్షణ కోర్సు ఉంది. ఇప్పుడు కోర్సు రెండో సంవత్సరం, మూడవ సంవత్సరం శిక్షణలో ఉన్న వారు పరేడ్లో పాల్గొన్నారు. మహిళా క్యాడెట్లు ఈ సంస్థ పేరును, దేశ ప్రతిష్టను మరింత ముందుకు తీసుకువెళ్లుతారని తనకు విశ్వాసం ఉందని రాష్ట్రపతి తమ ప్రసంగంలో తెలిపారు. కార్యక్రమానికి మహారాష్ట్ర గవర్నరు రమేష్ బయీస్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఇతరులు హాజరయ్యారు. స్నాతకోత్సవంగా సాగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి 353 మంది క్యాడెట్లకు పట్టాలు బహుకరించారు.
More Stories
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
జమ్మూ కాశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
మొబైల్ ద్వారా ఆధార్ సేవలకు ఓ కొత్త యాప్