ఇజ్రాయెల్ హమాస్ మధ్య నెల రోజులకు పైగా సాగుతున్న యుద్ధానికి తాత్కాలిక విరామం ఇస్తూ ఖతార్ మధ్యవర్తిత్వంతో నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ పాటించాలని ఇరుపక్షాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం మేరకు బందీల విడుదల శుక్రవారం ప్రారంభమైంది. తొలివిడుతలో భాగంగా తమవద్ద ఉన్న 25 మందిని హమాస్ వదిలేయగా, 39 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. శనివారం రెండో విడుతగా మరికొందరికి విముక్తి లభించనుంది.
ఈనేపథ్యంలో తాము విడుదల చేయనున్నవారి జాబితాను ఇజ్రాయెల్ ప్రభుత్వానికి హమాస్ అందించింది. ప్రస్తుతం దానిపై ప్రధాని బెంజమెన్ నెతన్యాహూతోపాటు అధికారులు సమీక్షిస్తున్నారని ఇజ్రాయెల్ వర్గాలు వెల్లడించాయి. తాము ఎవరెవరిని విడుదల చేయాలని అంశమై చర్చిస్తున్నామని తెలిపారు. ఇందులో ఇజ్రాయెల్, థాయిలాండ్ పౌరులున్నారు. హమాస్ విడుదల చేసిన వారిలో 13 మంది ఇజ్రాయెల్ పౌరులు, 12 మంది థాయిలాండ్ పౌరులు ఉన్నారు.
ఈ మేరకు ఆయా దేశాలు తమ పౌరులు విడుదలైనట్లు నిర్ధారించాయి. అలాగే ఇదే ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్ కూడా 39 మంది పాలస్తీనా ఖైదీల్ని ఇవాళ రాత్రికి విడుదల చేయబోతోంది. వారి పేర్లతో కూడిన జాబితాను హమాస్ విడుదల చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య ఒప్పందం సాఫీగా అమలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
గాజా నుండి 12 మంది థాయ్ బందీలను విడుదల చేశారని, వారిని తీసుకురావడానికి ఎంబసీ అధికారులు వెళ్తున్నారని థాయ్‌లాండ్ ప్రధాన మంత్రి స్రెట్టా థావిసిన్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. విడుదలైన బందీల పేర్లు, ఇతర వివరాలు త్వరలో తెలుస్తాయని ఆయన తెలిపారు. ఇజ్రాయెల్ జైళ్ల నుండి విడుదలైన మొదటి బ్యాచ్‌లో ఉంటారని భావిస్తున్న పాలస్తీనా ఖైదీల పేర్లను హమాస్ విడుదల చేయగా ఇందులో 24 మంది మహిళలు, 15 మంది మైనర్లు ఉన్నారు.
గత నెల 7న ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై దాడిచేసిన హమాస్ 240 మందిని బందీలుగా తమతో తీసుకెళ్లిన విషయం తెలిసిందే. కాగా, ఒప్పందంలో భాగంగా హమాస్ 50 మంది బందీలను, ఇజ్రాయెల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టాల్సి ఉంది. నాలుగు రోజుల కాల్పుల విరమణ నేపథ్యంలో మానవతా సాయం కూడా గాజా స్ట్రిప్‌లోకి ప్రవేశించడం ప్రారంభమైంది.
కాల్పుల విరమణ ప్రారంభమైన వెంటనే నాలుగు ఇంధన ట్యాంకర్లు, వంట గ్యాస్‌తో మరో నాలుగు ట్యాంకర్లు ఈజిప్టు నుంచి గాజాకి వచ్చాయని పాలస్తీనా రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. ఆహారం, నీళ్లు, ఔషధాలు వంటి అత్యవసర సామాగ్రితో కూడిన ట్యాంకర్లలో రోజుకు 196 ట్రక్కుల చొప్పున ఈ నాలుగు రోజుల్లో గాజా, వెస్ట్ బ్యాంకుకు రవాణా కానుందని వెల్లడించింది. యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి గాజాకు చేరుతున్న అతిపెద్ద సాయం ఇదేనని పేర్కొంది.

More Stories
అవామీ లీగ్ పార్టీపై యూనస్ ప్రభుత్వం నిషేధం
భారత వ్లాగర్‌ను నిర్బంధించిన చైనా
చంద్రుడిపై రష్యా అణువిద్యుత్ కేంద్రం!