నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఈడి సమన్లు

నటుడు ప్రకాశ్ రాజ్‌కు ఈడి సమన్లు
సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ షాక్‌ ఇచ్చింది. మనీలాండరింగ్‌ కేసులో ఈడీ నోటీసులు జారీ చేసింది. రూ.100కోట్ల పోంజీ స్కీమ్‌ కేసుకు సంబంధించిన కేసులో విచారణకు వచ్చేవారం రావాలని ఈడీ నోటీసుల్లో ఆదేశించింది.  చెన్నైలో వచ్చేవారం విచారణకు రావాలని సూచించింది. తిరుచ్చికి చెందిన ఓ ఆభరణాల సంస్థపై ఈ కేసు నమోదైంది.
 
తిరుచిరాపల్లికి చెందిన ప్రణవ్ జ్యువెలర్స్‌ సంస్థ పోంజీ స్కీమ్ ద్వారా అధిక లాభాలు చూపి వంద కోట్లు వసూలు చేసింది. అనంతరం ప్రణవ్ జ్యువెలర్స్ బోర్డు తిప్పేసింది. దీంతో సంస్థ యజామాని మదన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయడం జరిగింది.  ఇప్పటికే ఈ కేసులో చెన్నై, పుదుచ్చేరిలోని సంస్థలకు సంబంధించిన బ్రాంచ్‌లు, యజమానులపై నవంబర్ 20న ఈడీ సోదాలు చేసింది.
 ఆ జువెలరీ సంస్థ నుంచి లెక్కల్లో చూపని రూ.23.70 లక్షలు నగదు, కొన్ని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడి తెలిపింది. తమిళనాడు పోలీస్ ఆర్థిక నేరాల విభాగం నమోదు చేసిన కేసు ఆధారంగా మనీలాండరింగ్ ఆరోపణలపై విచారణ జరుపుతోంది. బంగారంపై పెట్టుబడుల పథకం పేరుతో ప్రజల నుంచి రూ.100 కోట్లు ప్రణవ్ జువెలర్స్ సేకరించిందని పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
అధిక రిటర్న్ ఇస్తామని ఈ మొత్తం సేకరించారని పేర్కొన్నారు.  ఈ క్రమంలోనే నటుడికి సమన్లు జారీ చేసింది.  ప్రణవ్‌ జ్యువెల్లర్‌ రూపొందించిన బోగస్‌ గోల్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్కీమ్‌పై విస్తృతంగా దర్యాప్తులో భాగంగా ప్రకాశ్‌రాజ్‌కు సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.   ప్రస్తుతం కంపెనీకి ప్రకాశ్‌రాజ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.ప్రణవ్ జ్యువెలర్స్ సంస్థ నిర్వహిస్తున్న పోంజీ పథకం, ఆర్థిక అక్రమాలకు పాల్పడిన ప్రణవ్ జువెలర్స్, ఇతరులపై తిరుచ్చిలోని ఆర్థిక నేరాల విభాగం దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ప్రకారం ఈడీ దర్యాప్తు చేస్తున్నది.