నటి త్రిషపై అనుచిత వాఖ్యల పట్ల ఎన్‌సీడబ్ల్యూ ఆగ్రహం

నటి త్రిషపై అనుచిత వాఖ్యల పట్ల ఎన్‌సీడబ్ల్యూ ఆగ్రహం
ప్రముఖ నటి త్రిషపై సహచర నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల జాతీయ మహిళా కమిషన్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించిన ఎన్‌సీడబ్ల్యూ   మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.  త్రిషపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయని  పేర్కొన్నారు.
స్త్రీల గురించి ఈ విధంగా అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని తెలిపారు.  కాగా, ఆ చిత్రం సినీ డైరెక్టర్ , రచయిత లోకేష్ కనగరాజ్ కూడా వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. మహిళలు, తోటి కళాకారుల పట్ల గౌరవం చూపే విషయంలో ఏ పరిశ్రమలో అయినా సరే ఎటువంటి రాజీ చూపకూడదని స్పష్టం చేస్తూ  తమ బృందంలో పనిచేసిన ఓ నటుడు ఈ విధమైన అనుచిత వాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.

‘‘త్రిష కృష్ణన్‌ను ఉద్దేశించి మన్సూర్‌ అలీఖాన్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అతడిపై ఐపీసీ సెక్షన్‌ 509బీతోపాటు ఇతర సంబంధిత సెక్షన్లపై కేసు నమోదు చేయాలని తమిళనాడు డీజీపీకి ఆదేశాలు జారీ చేస్తున్నాం. మహిళలపై హింసను ప్రేరేపించే ఇలాంటి వ్యాఖ్యలను సహించేది లేదు’’ అని ఎన్‌సీడబ్ల్యూ ట్వీట్‌ చేసింది. 

అసలు జరిగింది ఏంటంటే తమిళ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘లియో’ చిత్రంలో త్రిషతో ఓ సీన్‌ గురించి అసభ్యకరంగా వ్యాఖ్యలు చేశారు. ‘‘గతంలో ఎన్నో చిత్రాల్లో నేను రేప్‌ సీన్లలో నటించా. ‘లియో’లో ఆఫర్‌ వచ్చినప్పుడు త్రిషతోనూ అలాంటి సీన్‌ ఉంటుందని అనుకున్నా. కాకపోతే, అలాంటి సీన్‌ లేకపోవడం బాధగా అనిపించింది’’ అని మన్సూర్‌ అలీఖాన్‌ చెప్పారు. 

దీనిపై త్రిష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నాని, ఇకపై అతనితో నటించేది లేదని తేల్చి చెప్పారు. ఇలాంటి వారి వల్లే మానవాళికి చెడ్డపేరు వస్తుందని పేర్కొంటూ లియో చిత్రంలో అతడితో కలిసి స్ర్కీన్‌ షేర్‌ చేసుకోనందుకు ఆనందంగా ఉందని చెప్పారు. ఇకముందెప్పుడూ మరే చిత్రంలో కూడా అతనితో కలిసి నటించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.

నటి త్రిషను ఉద్దేశించి నటుడు మన్సూర్ అలీఖాన్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ (ఎస్‌ఐఐఎ ) ఆగ్రహం వెలిబుచ్చింది. దీనికి ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. త్రిషతోపాటు మరో కుష్బూ, రోజా లపై ఇటీవల అభ్యంతరకరమైన, అగౌరవనీయమైన వ్యాఖ్యలు మన్సూర్ చేశారని, ఆయన క్షమాపణ చెప్పేవరకు ఖాన్ సభ్యత్వాన్ని తాత్కాలికంగా రద్దు చేయాలని ఎస్‌ఐఐఎ డిమాండ్ చేసింది.

త్రిష ఆవేదనకు స్పందించిన ప్రముఖ నటి, బిజెపి నాయకురాలు కుష్బు సుందర్ కూడా ఎన్‌సిడబ్లు సభ్యురాలిగా మన్సూర్‌పై చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు. చిరంజీవి కూడా ఈ సంఘటనపై మండిపడ్డారు. తోటి ఆర్టిస్టుపై మన్సూర్ అలీఖాన్ చేసిన వ్యాఖ్యలు సహించరానివనీ, సభ్యసమాజం తల వంచుకునేలా ఉన్నాయని మెగాస్టార్ ట్వీట్ చేశారు. త్రిషకు అండగా ఉంటానని పేర్కొన్నారు.

తన వాఖ్యల పట్ల పెద్దఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నా ఖాన్ క్షమాపణ చెప్పే ప్రయత్నం చేయలేదు. నడిగర్ సంఘం ఆయనపై నిషేధం విధించింది. త్రిషకు సారీ చెబితేనే, నిషేధం తొలగిస్తామని మన్సూర్ కు తెగేసి చెప్పింది. అయితే సారీ చెప్పేది లేదంటూ తాజాగా వివాదానికి మరింత ఆజ్యం పోశారు మన్సూర్. నిషేధం ఎత్తివేసేందుకు నడిగర్ సంఘానికే తాను కొంత వ్యవధి ఇస్తున్నానని మన్సూర్ చెప్పారు. సినిమాల్లో రేప్ అంటే నిజంగా రేప్ చేస్తారా? హత్య చేసే సీన్ ఉంటే నిజంగా హత్య చేస్తారా? అని ఎదురు ప్రశ్నించారు