
మంత్రి కేటీఆర్ కు ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేటీఆర్ ప్రచార రథం మీద నుంచి ఒక్కసారిగా కింద పడిపోయారు. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఈ ఘటన జరిగింది. కెటీఆర్ తో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి, ఎంపీ సురేశ్ రెడ్డి కూడా కిందపడిపోయారు.
‘ప్రచార రథం’పై అభ్యర్థి జీవన్ రెడ్డి, కేటీఆర్, సురేష్ రెడ్డి, ఇంకా కొందరు ముఖ్య నేతలు ఉన్నారు. భారీ ర్యాలీ కావడంతో, వాహనం ముందు వైపు కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో ఉండటంతో వాహనాన్ని చాలా జాగ్రత్తగా డ్రైవర్ తోలుతున్నాడు. ఇంతలో కార్యకర్తల తాకిడి, ముందు వెళ్తున్న వాహనం అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయాల్సి వచ్చింది.
దీంతో ఒక్కసారిగా వాహనానికి పైనున్న గ్రిల్ ఊడిపోయింది. కేటీఆర్ ముందుకు ఒరిగిపడగా, జీవన్ రెడ్డి, సురేష్ రెడ్డి ఇద్దరూ పైనుంచి కింద పడిపోయారు. ఈ ముగ్గురికీ స్వల్పగాయాలయ్యాయి. సడన్ బ్రేక్ వల్లే ఈ ఘటన జరిగిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఆర్మూర్ పట్టణంలోని కిందివాడలో ఈ ప్రమాదం జరిగింది.
అదృష్టవశాత్తు తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని,ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందవద్దని అభిమానులు, పార్టీ శ్రేణులను కేటీఆర్ కోరారు. ప్రమాదం అనంతరం ఇక్కడ నామినేషన్ ప్రక్రియ ముగియగానే కొడంగల్ రోడ్ షోకు కేటీఆర్ బయల్దేరి వెళ్లారు. సడన్ బ్రేక్ వేయడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని.. అందరం సురక్షితంగా బయటపడ్డాం ఎవరికీ ఏమీ కాలేదని సురేష్ రెడ్డి చెప్పారు.
More Stories
లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం
దక్షిణ భారత కుంభమేళాగా గోదావరి పుష్కరాలు