ఐరాసలో `హమాస్’ పేరులేని తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరం

ఐరాసలో `హమాస్’ పేరులేని తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరం
ఇజ్రాయెల్- హమాస్ యుద్ధం నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో బాధితులకు ఎలాంటి అవరోధం లేకుండా సహాయ కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశ్యంతో ఐక్యరాజ్యసమితిలో ప్రతిపాదించిన ‘మానవతావాద సంధి’ తీర్మానంపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉగ్రవాద సంస్థ హమాస్ పేరును ఈ తీర్మానంలో ప్రస్తావించకపోవడమే ఇందుకు కారణమని భారత్ స్పష్టమైన వైఖరిని తెలియజేసింది.

ఇజ్రాయెల్- హమాస్ నేపథ్యంలో గాజా స్ట్రిప్‌లో ఎలాంటి అవరోధాలు లేకుండా సహాయ కార్యక్రమాలకు అవకాశం ఇవ్వాలని కోరుతూ జోర్డాన్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. బంగ్లాదేశ్, మాల్దీవులు, పాకిస్థాన్, రష్యా, దక్షిణాఫ్రికాతో సహా 40కిపైగా దేశాలు మద్ధతుగా నిలిచాయి.

`పౌరుల రక్షణ, చట్టపరమైన, మానవతా బాధ్యతలకు సమర్థన’ అనే పేరిట ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి అనుకూలంగా 120 దేశాలు, వ్యతిరేకంగా 14 దేశాలు ఓటు వేశాయి. 45 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. భారత్‌తోపాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, జపాన్, ఉక్రెయిన్, యూకేతోపాటు పలు దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి.

జోర్డాన్ రూపొందించిన ఈ తీర్మానంలో ఎక్కడా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ప్రస్తావన లేదు. ఈ విధంగా హమాస్ పేరు చేర్చకపోవడంపై అగ్రరాజ్యం అమెరికా కూడా మండిపడింది. చెడును విస్మరించడమేనని వ్యాఖ్యానించింది. ఇక ఈ తీర్మానంలో సవరణ చేయాలంటూ కెనడా  ప్రతిపాదించింది.  అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో జరిగిన హమాస్ ఉగ్రవాద దాడులను, అమాయకులను బందీలుగా మార్చుకోవడాన్ని నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నట్టు పేర్కొన్న పేరాను జత చేయాలని సూచించింది.

ఇలా ఉండగా, హ‌మాస్‌కు చెందిన వైమానిక ద‌ళ అధిప‌తి ఇస్సామ్ అబూ రుక్బే ఇజ్రాయిల్ వైమానిక దాడుల్లో హ‌త‌మయ్యాడు. శుక్ర‌వారం రాత్రి జ‌రిగిన దాడిలో అత‌ను చ‌నిపోయిన‌ట్లు ఇజ్రాయిల్ పేర్కొన్న‌ది. ఇజ్రాయిల్ ర‌క్ష‌ణ ద‌ళాలు ఈ విష‌యాన్ని ద్రువీక‌రించాయి. హ‌మాస్ ఉగ్ర గ్రూపుకు చెందిన డ్రోన్లు, ఏరియ‌ల్ వెహికిల్స్‌, ప్యారాగ్లైడ‌ర్స్‌, ఏరియ‌ల్ డిటెక్ష‌న్ సిస్ట‌మ్స్‌ను అబూ రుక్బే మేనేజ్ చేసేవాడ‌ని ఇజ్రాయిల్ మిలిట‌రీ పేర్కొన్న‌ది.