హ‌మాస్ టాప్ కమాండ‌ర్లను మ‌ట్టుబెట్టిన ఐడీఎఫ్‌

హ‌మాస్ టాప్ కమాండ‌ర్లను మ‌ట్టుబెట్టిన ఐడీఎఫ్‌
గాజాలోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ దళాలు హమాస్‌ను తుదముట్టించాలన్న లక్ష్యంతో గాజాపై జరుపుతున్న జరిపిన వైమానిక దాడుల్లో హమాస్‌కు చెందిన కీలక కమాండర్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ మిలిటరీ ప్రకటించింది.  తాజాగా, హ‌మాస్ వెస్ట్ర‌న్ ఖాన్ యూనిస్ బెటాలియ‌న్ క‌మాండ‌ర్ మ‌ద‌త్ ముబ్‌ష‌ర్‌ను హ‌త‌మార్చామ‌ని ఐడీఎఫ్ వెల్ల‌డించింది. 
 
వ‌రుస‌గా రెండోరోజూ గాజా ల‌క్ష్యంగా వైమానిక దాడుల‌తో ఐడీఎఫ్ విరుచుకుప‌డింది. హ‌మాస్‌ను తుద‌ముట్టించే దిశ‌గా ఐడీఎఫ్ వేగంగా పురోగ‌మిస్తోంది.  ఇక అంత‌కుముందు రోజు గాజా స్ట్రిప్‌లో 250 హ‌మాస్ టార్గెట్ల‌ను ఐడీఎఫ్ ధ్వంసం చేసింది.
 
ఐడీఎఫ్ బ‌ల‌గాలు, ఇజ్రాయిలీ సెటిల్‌మెంట్స్ ల‌క్ష్యంగా గ‌తంలో ముబ్‌ష‌ర్ ప‌లు దాడులు, విస్ఫోట‌నాల‌కు పాల్ప‌డ్డాడ‌ని సైనిక ప్ర‌తినిధి రియ‌ర్ అడ్మిర‌ల్ డేనియ‌ల్ హ‌గ‌రి వెల్ల‌డించారు.  పాల‌స్తీనా ఇస్లామిక్ జిహాద్ జెనిన్ విభాగం ఫీల్డ్ క‌మాండ‌ర్ ఐస‌ర్ మ‌హ్మ‌ద్ అల్ అమ‌ర్‌ను కూడా అంత‌మొందించామ‌ని ఐడీఎఫ్ ధ్రువీక‌రించింది.
కాగా, తమ ఫైటర్‌ జెట్లు జరిపిన దాడిలో హమాస్‌లోని దారాజ్‌ తుఫా బెటాలియన్‌ కు చెందిన ముగ్గురు కీలక ఆపరేటర్లు హతమైనట్లు అంతకు ముందు రోజు వెల్లడించింది. మృతి చెందిన వారి ఫొటోలను కూడా ట్విట్టర్‌ (ఎక్స్‌) ద్వారా విడుదల చేసింది.  హతమైన వారిని బెటాలియన్ డిప్యూటీ కమాండర్ ఇబ్రహీం జద్బా, కమాండర్ రిఫత్ అబ్బాస్, కంబాట్ సపోర్ట్ కమాండర్ తారెక్ మారౌఫ్ ఉన్నట్టు పేర్కొంటూ వారి ఫొటోలను విడుదల చేసింది.
 
దారాజ్‌ తఫా బెటాలియన్ అనేది గాజా సిటీ బ్రిగేడ్‌లోని ఒక బెటాలియన్ అని ఇజ్రాయెల్‌ మిలిటరీ తెలిపింది. ఇది ఉగ్రవాద సంస్థ హమాస్ కు అత్యంత ముఖ్యమైన బ్రిగేడ్‌ అని వెల్లడించింది. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై దాడి, మారణకాండలో ఈ బెటాలియన్‌ కీలక పాత్ర పోషించినట్లు తెలిపింది.

దాడుల్లో 50 మంది బందీలు మృతి

గాజాలోని హమాస్‌ స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయిల్ దళాలు జరుపుతున్న భీకర దాడుల కారణంగా తమ చేతిలో బందీలుగా ఉన్న 50 మంది ప్రాణాలు కోల్పోయారని హమాస్‌ తాజాగా వెల్లడించింది. అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పై మెరుపు దాడికి దిగిన హమాస్‌ మిలిటెంట్లు.సుమారు 224 మందిని బందీలుగా చేసుకున్నారు. 
 
వీరిలో ఇజ్రాయెల్‌ పౌరులతోపాటు ఇతర దేశాలకు చెందిన పౌరులు కూడా ఉన్నారు. అందులో ఇద్దరు ఇజ్రాయెల్‌ మహిళలతోపాటు ఇద్దరు అమెరికన్లను మానవతా కోణంలో హమాస్‌ విడుదల చేసింది. కాగా, తాజాగా ఇజ్రాయెల్‌ జరిపిన వైమానిక దాడుల్లో 50 మంది ప్రాణాలు కోల్పోయినట్లు హమాస్‌ ప్రకటించింది.