స్పేస్ ఫైబర్ ను ప్రారంభించిన రిలయన్స్ జియో

స్పేస్ ఫైబర్ ను ప్రారంభించిన రిలయన్స్ జియో
ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో శుక్రవారం మూడు రోజులపాటు జరిగే ఇండియా మొబైల్ కాంగ్రెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ  ప్రారంభించిన సందర్భంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ దేశంలో తొలి శాటిలైట్ ఆధారిత గిగా ఫైబర్ సర్వీస్ ‘జియో స్పేస్ ఫైబర్’ను విడుదల చేసింది. ఇది అధిక వేగంతో కూడిన బ్రాడ్ బ్యాండ్ సర్వీసులు అందించేందుకు వీలు కల్పిస్తుంది.
 
దేశీయంగా రిలయన్స్ అభివృద్ధి చేసిన టెక్నాలజీ, ఉత్పత్తులను ప్రధాని మోదీకి ఆకాశ్ అంబానీ తెలియజేశారు. జియో స్పేస్ ఫైబర్ ద్వారా కొత్తగా లక్షలాది మందికి చేరువ అవుతామని ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోదీ 100 5జీ ల్యాబ్ లను ప్రారంభించారు.  ‘‘ప్రతి తరానికి ఓ విజన్ అంటూ ఉండాలి. ఆ విజన్ ఎన్నింటికో ప్రోత్సాహంగా నిలవాలి. మీరు (ప్రధాని మోదీ) మా తరానికి మన దేేశాన్ని వికసిత భారత్ గా మార్చాలనే దృక్పధాన్ని కల్పించారు’’అని ఆకాశ్ అంబానీ పేర్కొన్నారు.
 
రిలయన్స్ జియో స్పేస్ ఫైబర్  ఉపగ్రహ ఆధారిత గిగాబైట్ బ్రాడ్ బాండ్ సర్వీస్. దీని ద్వారా ఇప్పటివరకు ఇంటర్నెట్ సేవలు అందని ప్రాంతాలకు కూడా ఇంటర్నెట్ సేవలను అందించే అవకాశం ఉంటుంది. భారత్ లో ఇదే తొలి ఉపగ్రహ ఆధారిత గిగాబైట్ బ్రాడ్ బాండ్ సర్వీస్. ‘డిజిటల్ సొసైటీలో ప్రజలందరినీ భాగస్వామ్యులను చేసే లక్ష్యంతో ఈ స్పేస్ ఫైబర్ ను ప్రారంభించామని ఆకాశ్ అంబానీ తెలిపారు. 
 
ప్రభుత్వ సేవలకు, విద్య, వైద్యం, వినోదం.. తదితర రంగాలకు ఈ స్పేస్ ఫైబర్ సేవలను అందిస్తుందని చెప్పారు. దీని ద్వారా ఇప్పటివరకు ఇంటర్నెట్ పరిథిలోకి రాని లక్షలాది మంది ఈ నెట్ వర్క్ లోకి వస్తారని వివరించారు.  ప్రస్తుతం జియో బ్రాండ్ బ్యాండ్ సేవలను అందిస్తున్న జియో ఫైబర్, జియో ఎయిర్ ఫైబర్ లకు ఇది అదనం.
ఈ ప్రాజెక్ట్ కోసం జియో లక్సెంబర్గ్ కు చెందిన ఎస్ఈఎస్ అనే సాటిలైట్ కమ్యూనికేషన్ ప్రొవైడర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం గుజరాత్ లోని గిర్, చత్తీస్ గఢ్ లోని కోర్బా, ఒడిశాలోని నబరంగ్ పూర్, అస్సాంలోని ఓఎన్జీసీ జోర్హాట్ ల్లో జియో స్పేస్ ఫైబర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. త్వరలో దేశవ్యాప్తంగా చవకగా ఈ సేవలను జియో అందుబాటులోకి తీసుకురానుంది.

యాపిల్ నుంచి గూగుల్ వరకూ బడా టెక్ కంపెనీలు దేశంలో తాయారీదారులుగా ఉండేందుకు క్యూలు కడుతున్నారని ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ప్రధాని మోదీ చెప్పారు. ఇటీవలే గూగల్ తమ ఫిక్సెల్ ఫోన్లను ఇండియాలో తయారు చేస్తున్నట్టు ప్రకటించిందని, శాంసంగ్ 5 మొబైల్ ఫోన్, యాపిల్ ఐఫోన్ 15 ఇండియాలో తయారవుతున్నాయని తెలిపారు. 
 
మొబైల్ బ్రాండ్‌బ్యాండ్ స్పీడ్‌లో భారత దేశం 43వ స్థానానికి చేరుకుందని,  క్యాపిటల్ యాక్సిస్, రిసోర్సెస్ యాక్సిస్, టెక్నాలజీ యాక్సిస్ అనేవి తమ ప్రభుత్వ ప్రాధాన్యతా క్రమాల్లో ఉన్నాయని వివరించారు. ఇవాళ మేడ్ ఇన్ ఇండియా ఫోన్లు ప్రపంచమంతా వాడుతున్నారని, దేశంలో 5జిని విస్తరించడం మాత్రమే కాకుండా, 6జి టెక్నాలజీలో లీడర్‌గా నిలిచేందుకు పురోగమిస్తోందని ప్రధాని తెలిపారు.