హమాస్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ జోర్డాన్ కింగ్ అబ్దుల్లా II తో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియా ప్రాంతంలోని పరిణామాలపై అభిప్రాయాలను ఆయనతో పంచుకున్నారు. ఉగ్రవాదం, హింస, పౌరుల మరణాలపై ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు, మానవతావాద పరిస్థితిని పరిష్కరించడానికి అవసరమైన సమిష్టి ప్రయత్నాలపై మాట్లాడటం జరిగిందని ట్విటర్ (ఎక్స్ ప్లాట్‌ఫామ్) మాధ్యమంగా ప్రధాని మోదీ తెలిపారు.
‘‘జోర్డాన్ కింగ్ అబ్దుల్లా IIతో ఆదివారం ఫోన్‌లో మాట్లాడటం జరిగింది. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై పరస్పర అభిప్రాయాలను పంచుకున్నాం. అలాగే.. తీవ్రవాదం, హింస, పౌర ప్రాణనష్టాలపై ఆందోళనలు వ్యక్తం చేశాం. శాంతి భద్రతలతో పాటు మానవతావాద పరిస్థితిని త్వరగా పరిష్కరించేందుకు సమిష్టి కృషి అవసరమని ఏకాభిప్రాయానికి వచ్చాం’’ అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
గాజాలో రాత్రి సమయంలో ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత ఆ ఇద్దరి మధ్య ఈ సంభాషణ నడిచింది. హమాస్ చేసిన దాడులకు ప్రతీకారంతో గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో అక్కడి పౌరులు మృతి చెందుతున్నారు. అంతకుముందు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో, అలాగే పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌తోనూ మోదీ ఫోన్‌లో మాట్లాడారు.
తాము ఇజ్రాయెల్‌కు అన్ని విధాలుగా మద్దతు తెలుపుతామని నెతన్యాహుతో చెప్పిన మోదీ, గాజాలోని అల్ అహ్లీ ఆసుపత్రిలో పౌరుల మరణాలపై అబ్బాస్‌తో మాట్లాడారు. తాము పాలస్తీనా ప్రజలకు మానవతా సహాయం పంపడం కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో తీవ్రవాదం, హింస, క్షీణిస్తున్న భద్రతా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-పాలస్తీనా సమస్యపై భారతదేశపు దీర్ఘకాల సూత్రప్రాయ వైఖరిని పునరుద్ఘాటించారు.

More Stories
తిరువనంతపురం, కోచి, కన్నూర్, త్రిసూర్ లలో హంగ్ మున్సిపాలిటీలు!
కర్ణాటకలో డ్రగ్స్ నేరాలకు పాల్పడితే కూల్చివేతలే!
ట్రంప్ తో ప్రధాని మోదీ టెలిఫోన్ సంభాషణలు!