ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు చేరుకున్న అయిదో విమానం

ఇజ్రాయెల్ నుంచి భారత్‌కు చేరుకున్న అయిదో విమానం
ఇజ్రాయెల్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకురావడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆపరేషన్ అజయ్ పేరుతో చేపట్టిన ఈ తరలింపు ప్రక్రియలో భాగంగా ఇజ్రాయెల్ నుంచి భారత్ కు అయిదో విమానం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది.  ఇందులో మొత్తం 286 మంది ప్రయాణికులున్నారు.
18 మంది నేపాలియన్లు సైతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే భారత్ వచ్చిన 4 విమానాల్లో వెయ్యికి పైగా భారతీయులు తిరిగి వచ్చారు. ఇజ్రాయెల్ లో 18 వేలకు పైగా భారతీయులు నివసిస్తున్నట్లు సమాచారం.  ఆపరేషన్ అజయ్ లో భాగంగా వచ్చిన ప్రయాణికులకు కేంద్ర సహాయ మంత్రి మురుగన్ స్వాగతం పలికారు.
వీరిలో కేరళకు చెందిన వారు 22 మంది ఉన్నారు. అయితే స్పైస్‌జెట్ విమానం ఎ340 టెల్ అవీవ్‌లో ల్యాండ్ అయిన తర్వాత సాంకేతిక సమస్యను ఎదుర్కొంది. దీంతో విమానాన్ని జోర్డాన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి భారత్ కు సురక్షితంగా తిరిగి వచ్చింది.
భారతీయ మహిళలపై ఇజ్రాయేల్ ప్రశంసలు
కాగా, హమాస్ ముష్కరుల దాడి నుంచి తమ పౌరులను కాపాడిన ఇజ్రాయేల్‌లో కేర్‌టేకర్లుగా పనిచేస్తున్న ఇద్దరు భారతీయ మహిళలపై ఇజ్రాయేల్ ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. మిలిటెంట్లను అడ్డుకోడానికి ఇద్దరు కేరళ మహిళల చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తూ భారత్‌లోని ఇజ్రాయేల్ రాయబార కార్యాలయం ట్విట్ చేసింది. 
 
తన అధికారిక ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేసిన ఎంబసీ ‘ఇండియన్ సూపర్ వుమెన్’ అంటూ సంబోధించింది. ఆ వీడియోలోని మహిళ డోర్ హ్యాండిల్‌ను పట్టుకుని హమాస్ ముష్కరులు తమ వద్దకు రాకుండా నిరోధించినట్టు ఆనాటి భయానక స్థితిని వివరించారు. గాజా సరిహద్దుల్లోని నీర్ ఓర్ అనే కిబ్బుట్జ్‌లో మీరా మోహనన్‌తో కలిసి కేర్ టేకర్‌గా పనిచేస్తున్నట్టు సబిత తెలిపారు. 
 
నరాల సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రాహెల్ అనే వృద్ధురాలికి సంరక్షకులుగా ఉన్నట్టు చెప్పారు. ‘నేను మూడేళ్లుగా కిబ్బుట్జ్ సరిహద్దుల్లోని ఓ ఇంట్లో సంరక్షకులుగా పని చేస్తున్నాం.. ఎఎల్ఎస్ వ్యాధితో బాధపడుతున్న ఒక వృద్ధురాలిని చూసుకుంటాం.. హమాస్ దాడి జరిగిన రోజు నాది నైట్ డ్యూటీ.. ఉదయం 6:30 గంటలకు బయలుదేరబోతున్నాను.. సైరన్‌లు విని సేఫ్టీ రూమ్‌వైపు పరుగెత్తాం.. ఇది నాన్‌స్టాప్‌గా మోగుతోంది’ అని ఆమె చెప్పారు.