ఆప్ ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ దాడులు

ఆప్ ఎమ్మెల్యే ఇంటిపై ఈడీ దాడులు
ఆప్ ఎమ్మెల్యే అమాన‌తుల్లా ఖాన్ ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో అక్రమ నియామకాల కేసులో ఆప్ ఎమ్మెల్యేపై ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇందులో భాగంగానే ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాఖలు చేసిన రెండు ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా ఈడి చర్యలు ప్రారంభించింది. 
 
అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్‌ బోర్డ్ ఛైర్మ‌న్ హోదాలో ఎన్నో అవినీతులు చేశార‌ని, ఎన్నో అక్ర‌మాలు జ‌రిగాయంటూ గ‌తంలోనే ఆయ‌న‌పై కేసులు న‌మోద‌య్యాయి. అయితే, ప్ర‌స్తుతం దీనికి సంబంధించి ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం ఈడీ సోదాలు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 
ఇదే కేసులో గ‌తంలో అమానతుల్లా ఖాన్‌ను ఢిల్లీ ఏసీబీ అరెస్టు చేసింది. ఆ తర్వాత సెప్టెంబర్ 2022లో ఆయన బెయిల్ ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చారు.
అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్న సమయంలో నిబంధనలను, ప్రభుత్వ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఏకంగా 32 మందిని అక్రమంగా రిక్రూట్ చేసుకున్నార‌ని ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ ఆరోప‌ణ‌ల కార‌ణంగానే ఆయ‌నపై కేసు న‌మోద‌య్యింది.  అమానతుల్లా ఖాన్‌ ఢిల్లీలోని ఓఖ్లా నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యే. అమానతుల్లా ఖాన్‌పై ఇప్ప‌టికే ఎన్నో అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఢిల్లీలోని జామియానగర్‌లోని అమానతుల్లా ఖాన్‌ ఇంటితోపాటు పలు చోట్ల ఈడీ సోదాలు నిర్వ‌హించిన‌ట్లు తెలుస్తోంది. గతేడాది కూడా అమానతుల్లాకు సంబంధించిన ఐదు చోట్ల అవినీతి నిరోధక శాఖ దాడులు చేసిన‌ట్లు సమాచారం. ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్ హోదాలో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఎన్నో అవినీతి కార్య‌క్ర‌మాల‌కు పాల్ప‌డ‌ట‌మే కాకుండా, కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. 

ఇదే కాకుండా ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు చెందిన పలు ఆస్తులను అక్రమంగా అద్దెకు ఇచ్చారనే ఆరోప‌ణ‌లు కూడా ఉన్నాయి. ఢిల్లీ ప్రభుత్వం నుంచి అందిన సహాయంతో సహా బోర్డు నిధులను దుర్వినియోగం చేసినట్టు కూడా ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్‌ కేసులో ఆమ్‌ ఆద్మీ నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే. అంత‌లోనే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మ‌రో నేత ఇంటిపై ఈడీదాడులు చేయ‌డం ఆ పార్టీ వ‌ర్గాలకు షాక్‌నిచ్చింది.