న్యూస్‌క్లిక్ వ్యస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్

న్యూస్‌క్లిక్ వ్యస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్
న్యూస్‌క్లిక్ పోర్టల్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థను ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ న్యూస్ పోర్టల్‌కు విదేశీ(చైనా) నిధులపై దర్యాప్తు నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసిటన్లు పోలీసులు తెలిపారు. ఆయనతోపాటు మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. న్యూస్‌క్లిక్ కార్యాలయాన్ని సీజ్ చేశారు. మంగళవారం అరెస్టు చేసిన ప్రబీర్ పుర్కాయస్థ,  అమిత్ చక్రవర్తిలకు ఏడు రోజుల పోలీసు రిమాండుకు పంపించినట్లు బుధవారం అధికారులు తెలిపారు.
 
 చైనా అనుకూల ప్రచారానికి నిధులు తీసుకున్నారనే ఆరోపణలు రావడంతో యూఏపీఏ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. మంగళవారం ఉదయం 30 చోట్ల ఈ కేసుకు సంబంధించిన జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు చేశారు పోలీసులు. 146 మంది అనుమానితులను ప్రశ్నించామని, లాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు, డాక్యుమెంట్లతోసహా అనేక డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నానమి, వాటిని అధ్యయనం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
 
ఇప్పటి వరకు ప్రబీర్ పుర్కాయస్థ తోపాటు ఆ సంస్థ హెచ్ఆర్ అమిత్ చక్రవర్తిని అరెస్ట్ చేసినట్లు ఢిల్లీ పోలీస్ అధికార ప్రతినిధి సుమన్ నల్వా వెల్లడించారు. న్యూస్‌క్లిక్ సంస్థకు చైనా నుంచి నిధులు అందుతున్నాయంటూ ఈ ఏడాది ఆగస్టులో న్యూయార్క్ టైమ్స్‌లో కథనం ప్రచురితమైంది.  చైనా వర్గాల నుండి మొత్తం రూ 38 కోట్ల మేరకు నిధులు పొందారని, వాటిని తమ పోర్టల్ లో చైనా అనుకూల కధనాలు వ్యాపింప చేసేందుకు ఉపయోగించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
 
అందులో రూ 29 కోట్లను ఎగుమతి సేవల నిమిత్తం స్వీకరించగా, మరో రూ 9 కోట్లను కంపెనీలో వాటాల విలువను భారీగా చూపి వసూలు చేశారు. తీస్తా సెతల్వాద్, గౌతమ్ నవలాకా వంటి వారికి కూడా ఈ నిధులను అందజేశారు.  చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నెవిల్ రాయ్ సింగం నుంచి గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్న న్యూస్‌క్లిక్ నిధులు పొందినట్లు ఆ కథనంలో పేర్కొంది.
దీంతో చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు.  మంగళవారం ఉదయం న్యూస్‌క్లిక్ కార్యాలయంతోపాటు ఆ సంస్థలో పనిచేసే జర్నలిస్టుల ఇళ్లు సహా మొత్తం 30 చోట్ల సోదాలు చేశారు. అయితే, న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టులు, రచయితల ఇళ్లపై ఢిల్లీ పోలీసులు దాడులు చేయడంపై ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. 
 
తాము ఈ పరిణామాలను పర్యవేక్షిస్తున్నామని, దీనిపై వివరణాత్మక ప్రకటన విడుదల చేస్తామని పేర్కొన్నారు. మరోవైపు, న్యూస్‌క్లిక్ పై దాడులను విపక్ష కూటమి ‘ఇండియా’ నేతలు తీవ్రంగా ఖండించారు. వాస్తవాలు మాట్లాడేవారి గళాన్ని అణిచివేసేందుకు కేంద్రం సోదాలు చేపట్టిందని విమర్శించారు.  కాగా, న్యూస్ క్లిక్, చైనా వ్యవహారంపై తాము కూడా పరిశీలిస్తున్నట్లు అమెరికా పేర్కొంది.
 
ఇలా ఉండగా, దేశంలో దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తున్నాయని, చట్టవ్యతిరేక కార్యకలాపాలు తమ దృష్టికి వచ్చిన్నప్పుడు దర్యాప్తు చేసే అధికారం వారికి ఉంటుందని కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేకంగా నిధులు పొందుతున్నట్లు, అభ్యంతరకరమైన చర్యలకు పాల్పడినప్పుడు దర్యాప్తు సంస్థలు పట్టించుకోకూడదని ఎక్కడా లేదని ఆయన తెలిపారు.