ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు ఈడీ స‌మ‌న్లు

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసుకు సంబంధించి బాలీవుడ్ న‌టుడు ర‌ణ్‌బీర్ క‌పూర్‌కు  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) బుధ‌వారం స‌మ‌న్లు జారీ చేసింది. అక్టోబ‌ర్ 6న విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని స‌మ‌న్ల‌లో న‌టుడిని ఆదేశించింది. మ‌హ‌దేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ప‌లువురు బాలీవుడ్ న‌టులు, గాయ‌కుల పాత్ర‌పై ద‌ర్యాప్తు సంస్ధ ఆరా తీస్తోంది.
 
యాప్ ప్ర‌మోట‌ర్ దుబాయ్‌లో నిర్వ‌హించిన వెడ్డింగ్‌, స‌క్సెస్ పార్టీకి ప‌లువురు బాలీవుడ్ సెల‌బ్రిటీలు హాజ‌ర‌వ‌డంపైనా ఈడీ వివ‌రాలు సేక‌రించింది. కాగా, టైగ‌ర్ ష్రాఫ్‌, స‌న్నీ లియోన్ వంటి బాలీవుడ్ సెల‌బ్రిటీలు ఈ వేడుకకు హాజ‌ర‌వ‌గా నేహ కక్క‌ర్ స‌హా ప‌లువురు సింగ‌ర్స్ ఈ వేడుక‌లో పెర్ఫామ్ చేశారు. 
 
వివాహ వేడుక‌కు అతీఫ్ అస్లాం, ర‌హత్ ఫ‌తే అలి ఖాన్‌, అలీ అస్ఘ‌ర్‌, విశాల్ ద‌డ్లానీ, ఎలీ అవిరామ్‌, భార‌తి సింగ్‌, భాగ్య‌శ్రీ, కృతి క‌ర్బందా, నుష్ర‌త్ బ‌రూచా, కృష్ణ అభిషేక్ వంటి సెల‌బ్రిటీలు హాజ‌ర‌య్యారు. ఈ వేడుక‌కు హాజరైన సెల‌బ్రిటీల‌కు ముంబైకి చెందిన ఓ ఈవెంట్ కంపెనీ పెద్ద‌మొత్తంలో చెల్లింపులు జ‌రిపిన‌ట్టు దర్యాప్తు సంస్ధ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఈ పెండ్లి వేడుక‌కు మ‌హ‌దేవ్ యాప్ ప్ర‌మోట‌ర్లు ఏకంగా రూ. 200 కోట్ల న‌గ‌దు ఖ‌ర్చుచేశార‌ని అధికారులు పేర్కొన్నారు. కుటుంబ‌స‌భ్యుల‌ను నాగ‌పూర్ నుంచి దుబాయ్‌కు త‌ర‌లించేందుకు ప్రైవేట్ జెట్స్‌ను బుక్ చేశారు. 

ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీకి రూ. 112 కోట్లు హ‌వాలా మార్గం ద్వారా త‌ర‌లించార‌ని ఈడీ డిజిట‌ల్ ఆధారాలను సేక‌రించింది. ఇక హోట‌ల్ బుకింగ్స్ కోసం రూ. 42 కోట్ల‌ను న‌గ‌దు రూపంలో కంపెనీ చెల్లించింది. మ‌హ‌దేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ రూ. 417 కోట్ల విలువైన ఆస్తుల‌ను అటాచ్ చేసింది.