జ‌మిలి ఎన్నిక‌లు సాధ్యమే… కానీ 2029 నాటికి

జ‌మిలి ఎన్నిక‌లు సాధ్యమే… కానీ 2029 నాటికి
 
లోక్‌సభతో పాటు దేశంలోని రాష్ట్రాల శాసనసభలకు కలిపి ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం సాధ్యమేనని న్యాయ కమిషన్‌ అభిప్రాయపడింది. అయితే వచ్చే లోక్‌సభ ఎన్నికల సమయానికి దీన్ని అమలు చేయడం సాధ్యం కాదని చెప్పింది. 2029 లోక్‌సభ ఎన్నికల నాటికి జమిలి సాకారం అయ్యే విధంగా ఒక ఫార్ములాను రూపొందిస్తున్నట్లు వెల్లడించింది.

ఇటీవల పోక్సో చట్టం సహా పలు అంశాలపై కర్ణాటక హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రితూ రాజ్‌ అవస్తీ నేతృత్వంలోని 22వ న్యాయ కమిషన్‌ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నేపథ్యంలో న్యాయ కమిషన్‌ వర్గాలు మీడియా ప్రతినిధులతో అనధికారికంగా మాట్లాడాయి. జమిలి ఎన్నికలపై ప్రభుత్వానికి ఇంకా నివేదిక ఇవ్వలేదని తెలిపాయి. 
 
ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో మరో ఉన్నత స్థాయి కమిటీని వేసిన సంగతి తెలిసిందే. కోవింద్‌ కమిటీని లోక్‌సభ మొదలు స్థానిక సంస్థల వరకు మూడంచెల ఎన్నికలన్నీ కలిపి జమిలిగా నిర్వహించే అవకాశాలను పరిశీలించాలని కోరారు.  కానీ, న్యాయ కమిషన్‌కు లోక్‌సభ, శాసనసభ.. రెండంచెల ఎన్నికలను జమిలిగా నిర్వహించడం వరకే ప్రతిపాదనలు పంపారు.
తమకు కూడా కోవింద్‌ కమిటీ తరహాలో స్థానిక ఎన్నికలను ఇందులో చేర్చాలని ఆదేశించే అవకాశం ఉన్నట్లు న్యాయశాఖ వర్గాలు అంచనా వేశాయి. అందుకే, మూడంచెలను దృష్టిలో ఉంచుకొనే తాము ఫార్ములాను రూపొందిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి.  తమ ఫార్ములా ప్రకారం జమిలీకి వీలుగా కొన్ని అసెంబ్లీల కాలపరిమితిని పొడిగిస్తారని, మరికొన్నింటి కాలపరిమితిని కుదిస్తారని తెలిపాయి.
అన్నింటికీ ఏడాది వ్యవధిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పాయి. స్థానిక సంస్థలు అంటే మున్సిపాలిటీలు, పంచాయతీలు, జిల్లా పరిషత్‌లు కూడా ఈ పరిధిలోకి వస్తాయి. మొత్తం 2 దశలలో అన్ని రకాల ఎన్నికల నిర్వహణకు ఫార్ములాను రూపొందిస్తున్నట్లు వెల్లడించాయి.  లోక్‌సభ, అసెంబ్లీలు, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఒకే ఓటర్ల జాబితాను రూపొందించేందుకు కూడా న్యాయ కమిషన్‌ ఒక యంత్రాంగాన్ని రూపొందిస్తోంది. దేశంలో జ‌మిలి ఎన్నిక‌ల‌కు అవ‌స‌ర‌మైన రాజ్యాంగ స‌వ‌ర‌ణ‌ల‌ను ఈ నివేదిక ప్ర‌భుత్వానికి సూచిస్తుంద‌ని చెబుతున్నారు.  
 
గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో 22వ లా క‌మిష‌న్ జ‌మిలి ఎన్నిక‌ల ప్ర‌తిపాద‌న‌పై జాతీయ రాజ‌కీయ పార్టీలు, ఈసీ, అధికారులు, విద్యావేత్త‌లు, నిపుణుల అభిప్రాయాలు కోరేందుకు ఆరు ప్ర‌శ్న‌ల‌ను రూపొందించింది. ఇక జ‌మిలిపై క‌స‌ర‌త్తు అనంత‌రం 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లోగా లా క‌మిష‌న్ త‌న నివేదిక‌ను సిద్ధం చేసి కేంద్ర న్యాయ‌మంత్రిత్వ శాఖకు స‌మ‌ర్పిస్తుంద‌ని భావిస్తున్నారు. 

జమిలి ఎన్నికలతో దేశ ప్రయోజనాలతో పాటు ప్రభుత్వ ఖజానా భారీగా ఆదా చేయవచ్చని లా కమిషన్ భావించింది. తరచూ ఎన్నికల కారణంగా ఓటర్లలో నిరాసక్తత ఏర్పడుతుందని, ఐదేళ్లకు ఓసారి ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ శాతం కూడా మెరుగుపడుతుందని లా కమిషన్ భావిస్తోంది.  జమిలి అంశాలపై లోతుగా, సుదీర్ఘంగా చర్చించి వివిధ సిఫార్సులతో కూడిన 22వ నివేదికను కేంద్రానికి అందించనుంది. ఆమేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 83, 85, 172, 174, 356లో సవరణలపై కసరత్తు చేస్తోంది. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లో సంబంధిత ప్రొవిజన్లను సవరించాలని కూడా సిఫారసు చేసింది.

లోక్‌స‌భ‌తో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ఒకేసారి నిర్వ‌హించ‌డం ద్వారా ప్ర‌జా ధనాన్ని ఆదా చేయ‌డంతో పాటు నిర్వ‌హ‌ణ వ్య‌వ‌స్ధ‌, భ‌ద్ర‌తా ద‌ళాలపై భారాన్ని త‌గ్గించ‌వ‌చ్చ‌ని, ప్ర‌భుత్వ ప‌ధ‌కాలు, విధానాలను మెరుగ్గా అమ‌లు చేయ‌వ‌చ్చ‌ని 2018లో 21వ లా క‌మిష‌న్ కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ‌కు అంద‌చేసిన ముసాయిదా నివేదిక‌లో పేర్కొంది.