
జీ 20 సదస్సుకు భారత్ సారథ్యం వహించడం ఓ సవాల్ అని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ఒకవైపు ప్రపంచం పేద, సంపన్న దేశాలుగా, తూర్పు- పశ్చిమ ధ్రువాలు (రష్యా పశ్చిమ దేశాలు)గా విడిపోతున్న సమయంలో భారత్ జీ20 సదస్సుకు సారథ్యం వహించిందని గుర్తు చేశారు.
న్యూయార్క్ వేదికగా జరిగిన “ఇండియా- యూఎన్ గ్లోబల్ సౌత్ డెలివరింగ్ ఫర్ డెవలప్‌మెంట్ ” సదస్సులో ఆయన పాల్గొంటూ “భారత్ గురించి మీకున్న సెంటిమెంట్లను , సౌత్‌సౌత్ (దక్షిణ భాగంలో ఉన్న పేద, అభివృద్ధి చెందుతున్న దేశాల) సహకారం ప్రాముఖ్యాన్ని ఇది నొక్కి చెబుతోంది. ప్రపంచ అభివృద్ధి, పురోగతి అజెండాగా భారత్ జీ20 సదస్సుకు బాధ్యత వహించింది. ఈ లక్షాన్ని సాధించాలనే సంకల్పానికి భారత్ కట్టుబడి ఉంది” అని జైశంకర్ పేర్కొన్నారు.
ప్రపంచ పటంలో దక్షిణ భాగంలో ఉన్న పేద, అభివృద్ధి చెందుతున్న దేశాలు (సౌత్‌సౌత్) ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన లేవనెత్తారు. జీ 20 సదస్సులో భాగంగా ఎన్నో దేశాలతో భారత్ చర్చలు జరిపిందని, దీనిలో చాలా విషయాలు గమనించినట్టు చెప్పారు. గ్లోబల్ సౌత్‌లో నిర్మాణాత్మక అసమానతలు, రాజకీయ పోటీలు, ఉద్రిక్తతలు, సంస్కరణలు ఉన్నట్టు గుర్తించామని వివరించారు.
ఈ వివాదాల కారణంగా దక్షిణ దేశాలపై ఒత్తిడి పెరుగుతోందని తెలిపారు. ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని జైశంకర్ హెచ్చరించారు. అంతేకాకుండా భౌగోళిక రాజకీయ సమీకరణలు, పోటీలు అనేక దేశాల్లో ఆహారం, ఎరువులు, ఇంధనం వంటి ప్రాథమిక అవసరాలు తీరడంపై కూడా ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ రాజకీయాలలో ఇంకా ద్వందప్రమాణాలు నెలకొన్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, భారత్ తరఫున కేంద్ర మంత్రి జైశంకర్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో సెప్టెంబర్ 26న ప్రసంగించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే న్యూయార్క్ చేరుకొన్నారు. అనంతరం ఆయన వాషింగ్టన్ డీసీని సందర్శించనున్నారు.
More Stories
పాక్‌లో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
పీవోకేలో ఆందోళనకారులపై కాల్పులు.. 10 మంది మృతి
అమెరికాలో మొదలైన ‘షట్‌డౌన్’