హైదరాబాద్‌ అభివృద్ధిలో గేమ్‌ ఛేంజర్‌గా రీజినల్‌ రైలు కనెక్టివిటీ

హైదరాబాద్‌ అభివృద్ధిలో గేమ్‌ ఛేంజర్‌గా రీజినల్‌ రైలు కనెక్టివిటీ

రీజినల్‌ రింగురోడ్డుతోపాటు దానికి అనుసంధానంగా రీజినల్‌ రైలు రావడం విశ్వనగరంగా హైదరాబాద్‌ అభివృద్దిలో గేమ్‌ చేంజర్‌గా మారబోతోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌ మరింత అభివృద్ధి చెందాలంటే ఆర్‌ఆర్‌ఆర్‌ అత్యంత కీలకమని చెప్పారు.  ట్రిపుల్‌ఆర్‌ వస్తే రవాణా కనెక్టివిటీ పెరిగి ఆ రోడ్డు లోపల పేదలకు తక్కువ ధరకు భూములు దొరుకుతాయని, పేదల సొంతింటి కల నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఏ రాష్ట్రాన్రికి లేని విధంగా తెలంగాణకు అత్యధికంగా వందే భారత్‌ రైళ్లు వస్తున్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్రికి ఇప్పటికే రెండు వందే భారత్‌ రైళ్లు వచ్చాయని, ఆదివారం నాడు మూడో వందే భారత్‌ హైదరాబాద్‌- బెంగళూరు రైలును ప్రధాని ప్రారంభించారని సంతోషం వ్యక్తం చేశారు. 

వినాయక చవితి సందర్భంగా మూడో టైన్‌ ప్రారంభించుకోవడం శుభపరిణామమని చెబుతూ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆదివారం కాచిగూడ- యశ్వంతపూర్‌ వందేభారత్‌ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కాచీగూడ నుంచి ప్రారంభమయిన తాజా వందేభారత్‌ రైలుమూడు రాష్ట్రాలను ల్లోని 12 జిల్లాలను కలపనుందని పేర్కొన్నారు. 

వందే భారత్‌ రైలు రాకతో బెంగళూరుకు ఒకే రోజు వెళ్లి రావొచ్చని చెప్పారు. తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని చెబుతూ గత తొమ్మిదిన్నరేండ్లలో ఏటా 55 కిలోమీటర్ల రైల్వే లైన్‌ల నిర్మాణం రాష్ట్రంలో చేపట్టారని వెల్లడించారు.

 2014 యూపీయే హయాంలో తెలంగాణకు రైల్వే బడ్జెట్‌ రూపంలో రూ.258 కోట్లు ప్రవేశపెట్టారుని, ప్రస్తుతం మోదీ ప్రభుత్వం రూ.4,418 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. తెలంగాణలో రూ. 31 వేల కోట్ల  రైల్వే పనులు నిర్మాణంలో ఉన్నాయని, దాదాపు రూ.2300 కోట్లతో అనేక రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి  వివరించారు.

సికింద్రాబాద్‌ స్టేషన్‌కు రూ. 717 కోట్లు కేటాయించి ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేశారని, పనులు పూర్తయితే ఎయిర్‌ పోర్ట్‌ మాదిరిగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌మారబోతోందని కిషన్ రెడ్డి తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయని, కాచీగూడ ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభించబోతున్నామని వెల్లడించారు. 

కాజీపేటలో రైల్‌ మ్యానుఫ్యాక్చర్‌ యూనిట్‌ నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయని, ఫస్ట్‌ పేజ్‌ లో వ్యాగన్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ మొదలవుతుందని తెలిపారు. ఆ తర్వాత రైలుకు సంబంధించిన అన్ని ఉత్పత్తులు అక్కడ తయారవుతాయని చెప్పారు.