రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం తనకు లేదని గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. తెలంగాణ గవర్నర్ గా నాలుగేళ్ల పదవీకాలం పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ తనకు ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని చెప్పారు.
తాను కన్నింగ్ ఆలోచనలు చేయడంలేదని, రాష్ట్ర ప్రభుత్వంతో అభిప్రాయ భేదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంలో ప్రభుత్వం బాగా పని చేస్తుందని గవర్నర్ కితాబు ఇచ్చారు. సీఎం కేసీఆర్ సీనియర్ నేత అని, శక్తివంతమైన నేత అని, ఆయనకు రాజకీయ అనుభవం ఉందంటూ ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని గవర్నర్ తెలిపారు. నాలుగేళ్లుగా సీఎం కేసీఆర్ పాలన చూస్తున్నానని ఆమె గుర్తు చేశారు.
ఆర్టీసీ కార్మికుల లబ్ధి కోసమే బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించానని, గవర్నర్ కోటా ఎమ్మెల్సీ కేటగిరిపై ప్రభుత్వం పూర్తిగా స్పష్టత ఇవ్వలేదని రాష్త్ర ప్రభుత్వంతో వివాదం ఏర్పర్చిన అంశాలను ప్రస్తావించారు. రాజ్ భవన్ ప్రగతి భవన్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేస్తూ తన ఫోకస్ అంతా ప్రజల అభివృద్ధిపైనేనని గవర్నర్ స్పష్టం చేశారు.
బిల్లుల విషయంలో జరిగిన చర్చపై ప్రజాశ్రేయస్సు కోసమే తన అభిప్రాయం చెప్పానని తెలిపారు. ఆర్టీసీ బిల్లుపై అనవసరంగా వివాదం సృష్టించారని ఆమె విచారం వ్యక్తం చేయసారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ పొలిటికల్ నామినేషన్ కాదన్న తమిళి సై ఎమ్మెల్సీకి అర్హత పూరిస్తే సంతకం చేయడానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని తేల్చి చెప్పారు.
తెలంగాణ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్నానని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా శక్తి వంచన లేకుండా రాష్ట్రానికి తాను సేవలు అందిస్తున్నట్లు తెలిపారు.”రాజ్‌భవన్‌ను ప్రజాభవన్‌గా మార్చాను. కోర్టు కేసులు, విమర్శలకు భయపడను. ప్రోటోకాల్ ఉల్లంఘనలతో నన్ను కట్టడి చేయలేరు. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది. కానీ రాజ్‌భవన్‌కు కొన్ని పరిమితులు ఉన్నాయి. ప్రజలకు మరింత సేవ చేయాలని ఉన్నా నిధుల కొరత ఉంది” అంటూ ఆమె వివరించారు.
తెలంగాణలో తాను ప్రజలను కలిస్తే రాజకీయం చేస్తున్నారని విమర్శలు చేస్తున్నారని, కానీ పుదుచ్చేరిలో ప్రతి నెల 15న ప్రజలను కలుస్తున్నానని, అక్కడి అధికారులు అందుకు పూర్తిగా సహకరిస్తున్నారని గవర్నర్ తెలిపారు. ఆరు గిరిజన గ్రామాలను దత్తత తీసుకున్నట్లు చెబుతూ అక్కడ మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టానని ఆమె చెప్పారు.
గిరిజనులకు అవగాహన కల్పించేందుకు వారి మధ్యే తాను వాక్సిన్ తీసుకున్నానని గవర్నర్ గుర్తు చేశారు. ఫిర్యాదులు బాక్స్ ద్వారా వచ్చే దరఖాస్తులను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొంటూ తన పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. తెలంగాణ, పుదుచ్చేరిలో తన విధుల్లో ఎలాంటి లోపం లేకుండా పనిచేస్తున్నానని గవర్నర్ సంతృప్తి వ్యక్తం చేశారు.

More Stories
హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవీదేవిపై దుష్ప్రచారం.. పోలీసులకు ఫిర్యాదు
11వ శతాబ్దం నాటి చోళుల రాగి పలకలు భారత్ కు అప్పగింత
హైకోర్టు తీర్పుతో భోజ్‌శాల సముదాయంలో విశేషంగా పూజలు!