
భారత్ అభ్యర్థన మేరకే భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన దానిలో వాస్తవం లేదని, వాస్తవానికి ద్వైపాక్షిక చర్చల కోసం అభ్యర్థించింది చైనాయేనని, అది ఇంకా పెండింగ్‌లో ఉందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. రెండు రోజుల క్రితం దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు కొద్ది సేపు సంభాషించిన విషయం తెలిసిందే.
అది కూడా వేదికపై నుంచి కిందికి దిగుతున్న వేళ నెమ్మదిగా అడుగులేస్తూ క్లుప్తంగా సంభాషించారు. ఇదే వేదికపై మోదీ, జిన్‌పింగ్‌లు ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొంటారని తొలుత వార్తలు వచ్చినప్పటికీ సమావేశంలో ఇరువురు నేతలు ఎక్కడా ప్రత్యేక చర్చలో పాల్గొనలేదు. అనధికారికంగా మాత్రం కొద్ది సేపు ముచ్చటించుకున్నారు.
కాగా భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు మధ్య జరిగిన అనధికారిక చర్చల్లో ఇరువురు వాస్తవాధీన రేఖ వద్ద బలగాలను తొలగించి ఉద్రిక్తతలను సడలించే విషయంపై చర్చించినట్లు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ ఖ్వాత్రా తెలియజేశారు. భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో అపరిష్కృత అంశాలపై ఈ సందర్భంగా జిన్‌పింగ్‌తో ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొన్నారు.
మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య రెండు వారాల్లోనే ఇది రెండవ భేటీ కావడం గమనార్హం. అంతకుముందు ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు నేపధ్యంలో ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. 2020 జూన్‌లో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్ లోయ వద్ద ఇరు దేశాల సైనికుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో భారత ప్రధాని సరిహద్దు వెంబడి పరిష్కారం కాని అనేక సమస్యల ప్రస్తావన కూడా తీసుకు వచ్చినట్లు తెలిపారు. ఇక ద్వైపాక్షిక చర్చల ప్రస్తావన తీసుకువచ్చింది చైనాయేనని, భారత్ ఇంకా ఈ విషయమై నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ఇదిలా ఉండగా చైనా విదేశాంగ శాఖ మాత్రం భారత్ అభ్యర్థన మేరకే చైనా అధ్యక్షుడు భారత ప్రధానితో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారని, ప్రజల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగు పరిచే అంశమై చర్చించినట్లు తెలిపింది. రెండు దేశాల మధ్య శాంతి, సుస్థిరతలను నెలకొల్పితేనే ప్రపంచాభివృద్ధితో పాటు దేశాభివృద్ధికి కూడా సాధ్యమవుతుందని చైనా విదేశాంగ శాఖ తెలిపింది.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా