
వైయస్‌ఆర్ జిల్లా నందలూరు మండలం ఈదరపల్లెలో జన్మించిన భూమన కరుణాకర్‌రెడ్డి తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. వామపక్ష తీవ్రవాద భావజాలంతో ఉన్న ఆయన తర్వాత అధ్యాత్మికత వైపుకు మళ్లారు. గతంలోనూ 2006 నుంచి 2008 వరకు తితిదే బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు.
టీటీడీ ఆధ్వర్యంలో పేద వధూవరుల కోసం కల్యాణమస్తు, వెనుకబడిన ప్రాంతాల్లో శ్రీవారి కల్యాణాలు చేయించేందుకు దళిత గోవిందం వంటి కార్యక్రమాలను అమలుచేశారు. బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవం రోజున శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తుల తాకిడి పెరిగిన దృష్ట్యా ప్రతి పౌర్ణమికి తిరుమలలో గరుడ వాహన సేవను ప్రారంభించారు.
రెండో పర్యాయం ఛైర్మన్‌గా నియమితులు కావడంతో రెండేళ్లపాటు ఆయన తితిదే ఛైర్మన్ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా భూమన మాట్లాడుతూ జగన్ ఆశీస్సులతో రెండవ సారి స్వామి వారి సేవ చేసే భాగ్యం దక్కిందని పేర్కొన్నారు. సామాన్య భక్తులకే తన తొలి ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
వీఐపీలకు ఊడిగం చెయ్యనని తెలిపారు. మాటల్లో కాకుండా ఆచరణలో చూపిస్తానని, హిందూ ధార్మికతను విశ్వవ్యాప్తం చేస్తానని చెప్పారు. ‘‘మనం ఎంత సేపు స్వామి వారిని దర్శించుకున్నాం అన్నది ముఖ్యం కాదు.. క్షణ కాలం పాటు మనల్ని భగవంతుడు చూస్తున్నాడా లేదా అన్నది ముఖ్యం… వీఐపీలు ఇది గుర్తుపెట్టుకోండి’’ అని పేర్కొన్నారు.
ఎవరు ఎన్ని విమర్శలు చేసినా పట్టించుకోనని అంటూ ఆలయ అభివృద్ధితో పాటు సామాన్య భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా సులభతరంగా దర్శనం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటానని తెలిపారు. దళిత గోవిందం, పున్నమి గరుడ సేవ, కళ్యాణమస్తు, భక్తులందరికీ అన్నప్రసాద వితరణ లాంటి ఎన్నో సంస్కరణలను గతంలో తెచ్చానని గుర్తుచేశారు. టీటీడీ ఉద్యోగులకు త్వరలోనే ఇంటి స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు.
More Stories
భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా స్వదేశీ సంత
చక్రస్నానంతో ముగిసిన శ్రీవారి బ్రహ్మోత్సవాలు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు