16న విచారణకై రామోజీరావు, శైలజలకు సమన్లు

16న విచారణకై రామోజీరావు, శైలజలకు సమన్లు
మార్గదర్శి చిట్ ఫండ్స్ పై నమోదు చేసిన కేసులో తాజాగా ఏపీ సీఐడీ అధికారులు మరోసారి రామోజీరావు, మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్‌లకు  నోటీసులను జారీ చేశారు. వారిని విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 10:30 గంటలకు విజయవాడ సత్యనారాయణపురంలోని తమ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని సూచించారు. 
 
ఈ మేరకు అదనపు పోలీస్ సూపరింటెండెంట్ ఎస్ రాజశేఖర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై విస్తృత దాడులను నిర్వహించిన అనంతరం కేసు పెట్టిన సీఐడీ అధికారులు ఇదివరకు ఆస్తులను అటాచ్ చేశారు. దీని విలువ రూ. 820 కోట్లు.

ఛిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఉల్లంఘించిందనే ఆరోపణలను ఎదుర్కొంటోంది మార్గదర్శి చిట్స్ సంస్థ యాజమాన్యం. 
 
అవి నిజమని తేలడంతో సీఐడీ అధికారులు ఇదివరకే కేసు నమోదు చేశారు. మార్గదర్శి ఛిట్ ఫండ్స్ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచారు. తాజాగా రామోజీ రావు ఆస్తులను అటాచ్ చేశారు.
మార్గదర్శి ఛిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ల నివాసాలపై గతంలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలను నిర్వహించారు. 
 
రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు విస్తృతంగా కొనసాగాయి. మార్గదర్శి కార్యాలయాల్లో రోజంతా తనిఖీలను కొనసాగించారు. పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రామోజీరావును కూడా వారు విచారించారు. ఫిల్మ్‌సిటీలోని రామోజీ రావు నివాసంలో ఈ విచారణ కొనసాగింది.

 
ఈ పరిణామాల మధ్య తాజాగా ఏపీ సీఐడీ అధికారులు రామోజీరావు ఆస్తులను అటాచ్ చేశారు. నిబంధనలకు వ్యతిరేకంగా మార్గదర్శిలో డబ్బులను డిపాజిట్ చేసిన చందాదారుల నిధుల మళ్లించినట్లు అధికారులు నిర్ధారించారు. 40 సంస్థలకు వాటిని మళ్లించినట్లు గుర్తించారు. ఈ 40 సంస్థల పేర్లను ఈ జీఓలో పొందుపరిచారు.