ప్రధానిని పోలవరం నిర్వాసితులు ప్యాకేజీ కోరిన జగన్

ప్రధానిని పోలవరం నిర్వాసితులు ప్యాకేజీ కోరిన జగన్

పోలవరం నిర్వాసితులకు సహాయ పునరావాస ప్యాకేజీ కేంద్రం ఇవ్వాలని, పోలవరం అంచనా వ్యయం రూ. 55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి ‘పోలవరం తొలిదశలో భాగంగా మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ ఇవ్వాల్సి ఉంది. ఇది ఇస్తేనే తొలిదశ పూర్తి అవుతుంది. కనుక మొత్తం పోలవరం తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు ఇవ్వాలి’ అని ప్రధానిని కోరారు.

ప్రధానితో దాదాపు ఒక గంట 20 నిమిషాల పాటు ముఖ్యమంత్రి భేటీ సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానితో సమావేశానికి ముందు కేంద్రం హోంమంత్రి అమిత్‌ షాతో దాదాపు 45 నిమిషాలు పాటు వైఎస్‌ జగన్‌ భేటీ అయ్యారు. ప్రధానితో సమావేశం తరువాత కేంద్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఆయన కలిశారు.

పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు తొలిదశ నిర్మాణానికి రూ.17,144 కోట్లు అవసరం అవుతుందని, ఇది కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉందని తెలిపారు. పోలవరం తొలిదశ నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ ఇప్పటికే రూ.12,911.15 కోట్ల మంజూరుకు గ్రీన్‌ సిగుల్‌ ఇచ్చిందని పేర్కొన్నారు. 

అయితే తొలిదశలో మరో 36 గ్రామాల్లోని నిర్వాసితులకు సహాయ పునరావాసం ప్యాకేజీ ఇవ్వాల్సి ఉందని, ఇది ఇస్తేనే తొలిదశ పూర్తైనట్టని ప్రధానికి జగన్‌ వివరించారు. అలాగే ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.1,310.15 కోట్లను వెంటనే రీయింబర్స్‌ చేయాలని కూడా కోరారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో హేతుబద్ధత లోపించిన విషయాన్ని మరోసారి ప్రధానిదృష్టికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు. రాష్ట్రంలో 56 లక్షల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రేషన్‌ దక్కకుండా పోతోందని, దీనివల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా రూ.5,527 కోట్ల భారం పడుతోందని, సత్వరమే జోక్యం చేసుకోవాలని కోరారు. 

ప్రతినెలా వినియోగించకుండా దాదాపు లక్ష టనుుల బియ్యం కేంద్రం వద్ద ఉంటోందని, ఇందులో 77 వేల టన్నులు రాష్ట్రానికి ఇస్తే సరిపోతుందని జగన్ తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు గతంలో ఉన్న 11 కాలేజీలకు తోడు అదనంగా మరో 17 కాలేజీల నిర్మాణాలను చేపట్టామని, ఈ కాలేజీలకు తగిన ఆర్ధిక సహాయం చేయాలని కోరారు. 

కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన కడప జిల్లా స్టీల్‌ప్లాంట్‌కు ముడి ఖనిజం కోసం మూడు గనులను ఏపిఎండిసికి కేటాయించేలా కేంద్ర గనుల శాఖకు ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఏపి పౌర సరఫరాల శాఖకు దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న సబ్సిడీ బకాయిలు రూ.1,702.90 కోట్లను మంజూరు చేయాల్సిందిగా కోరారు.

2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి బకాయిలు అలాగే పెండింగులో ఉన్నాయని, ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన రూ.7,230.14 కోట్ల చెల్లింపులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.