హెచ్‌-1బీ వీసా రెన్యూవ‌ల్ సులభతరం

హెచ్‌-1బీ వీసా రెన్యూవ‌ల్ సులభతరం
హెచ్‌1బి వీసాలు కలిగిన భారత పౌరులకు అమెరికాలో జీవనాన్ని సులభతరం చేసేలా బైడెన్‌ ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకోనుంది. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. హెచ్‌1బి వీసాల రెన్యువల్‌ను సులభతరం చేయనున్నట్లు విదేశాంగ శాఖ త్వరలో ప్రకటించే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి.
 
దీంతో హెచ్‌1బి వీసాలు కలిగిన భారతీయులు, ఇతర విదేశీ ఉద్యోగులు విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే అమెరికాలో తమ వీసాలను పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుందని వెల్లడించాయి. అయితే ప్రస్తుతం కొద్దిమంది విదేశీయులకు మాత్రమే ఈ అవకాశం కల్పించనున్నామని, రాబోయే రోజుల్లో ఈ పథకాన్ని మరింత విస్తరించవచ్చని స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి పేర్కొన్నారు.
 
హెచ్‌1బి వీసాలపై అమెరికా వెళ్లేవారిలో భారతీయులే అధికంగా ఉన్నారు. గతేడాది 4,42,000 హెచ్‌1బి వీసాదారుల్లో 73 శాతం భారతీయులే ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది.  అయితే ఏ వీసాదారులకు అవకాశం కల్పించనున్నారు, ఈ పథకం ఎప్పటి నుంచి ప్రారంభం కానుందనే ప్రశ్నలపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
 
ఈ పైలెట్‌ ప్రోగ్రాంకి సంబంధించిన ప్రణాళికను బ్లూమ్‌బెర్గ్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం నైపుణ్యం కలిగిన విదేశీ కార్మికుల కోసం 65,000 హెచ్‌1 బి వీసాలను విడుదల చేసుంది. వాటితో పాటు అదనపు అర్హతలు కలిగిన కార్మికుల కోసం మరో 20,000 వీసాలను జారీ చేస్తుంది.
 
ఈ వీసాలు మూడేళ్ల వరకు కొనసాగుతాయి. మరో మూడేళ్లకు పునరుద్ధరించబడతాయి. హెచ్‌1 బి వర్కర్లను భారత్‌కు చెందిన ఇన్ఫోసిస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ లతో పాటు అమెజాన్‌, అల్ఫాబెట్‌, మెటా కంపెనీలు నియమించుకుంటున్నట్లు అమెరికా ప్రభుత్వం తెలిపింది.