ఎన్డీయే కూట‌మిలోకి జిత‌న్ మాంఝీ

ఎన్డీయే కూట‌మిలోకి జిత‌న్ మాంఝీ
బిహార్‌లో నితీష్ కుమార్ స‌ర్కార్‌కు మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించిన జిత‌న్ రాం మాంఝీ పార్టీ ఎన్డీయేకు చేరువ‌య్యే దిశ‌గా సంకేతాలు పంపింది. థ‌ర్డ్ ఫ్రంట్ ప్ర‌తిపాద‌న‌నూ ప‌రిశీలిస్తున్నామ‌ని ఆ పార్టీ పేర్కొంది. ఢిల్లీ వేదిక‌గా పావులు క‌దిపేందుకు హిందుస్తానీ ఆవాం మోర్చా చీఫ్, మాంఝీ కుమారుడు సంతోష్ సుమన్ హ‌స్తిన బాట ప‌ట్టారు.
ఇక బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి జిత‌న్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్తానీ ఆవాం మోర్చా (హెచ్ఏఎం) నితీష్ కుమార్ ప్ర‌భుత్వానికి సోమ‌వారం మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించింది. నితీష్ స‌ర్కార్‌కు మ‌ద్ద‌తును ఉప‌సంహరిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు, మాంఝీ కుమారుడు సంతోష్ సుమ‌న్ బిహార్ గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర అర్లేకర్‌కు లేఖ అంద‌చేయ‌నున్నారు.

త‌మ పార్టీని విలీనం చేయాల‌ని నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ఒత్తిడి చేస్తోంద‌ని ఆరోపిస్తూ గ‌త‌వారం కేబినెట్ నుంచి సుమ‌న్ వైదొలిగారు. త‌దుప‌రి చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు సుమ‌న్‌కు హెచ్ఏఏం జాతీయ కార్య‌వ‌ర్గం అధికారాలు క‌ట్ట‌బెట్టింది. తాను ఢిల్లీ వెళుతున్నాన‌ని, ఎన్డీయే నుంచి ఆహ్వానం అందితే కాషాయ‌ కూట‌మిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

థ‌ర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామ‌ని చెప్పారు. ఎనిమిదేండ్ల కింద‌ట హెచ్ఏఎం పురుడుపోసుకున్న‌ప్ప‌టి నుంచి ప‌లుమార్లు ప‌లు కూట‌ముల‌కు స‌న్నిహితంగా ఉండ‌టం ఆపై బ‌య‌ట‌కు రావ‌డం జ‌రిగింది. ఇక ఢిల్లీలో బీజేపీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాతో స‌మావేశం అవుతున్నార‌నే వార్త‌ల‌పై స్పందించేందుకు హెచ్ఏఎం చీఫ్‌ సంతోష్ సుమ‌న్ నిరాక‌రించారు.

కాగా, న‌లుగురు ఎమ్మెల్యేలు క‌లిగిన హెచ్ఏఎం గ‌త ఏడాది బీజేపీని వీడిన నితీష్ కుమార్‌కు మ‌ద్ద‌తుగా మ‌హాకూట‌మి ప్ర‌భుత్వంలో చేరింది.  243 మంది స‌భ్యులు క‌లిగిన బిహార్ అసెంబ్లీలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌ల‌తో కూడిన పాల‌క సంకీర్ణానికి 160 మంది ఎమ్మెల్యేల బ‌లం ఉంది. వామ‌ప‌క్షాల‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు నితీష్ స‌ర్కార్‌కు బ‌య‌టి నుంచి మ‌ద్ద‌తు ఇస్తున్నారు.