
ఎంఆర్ఎఫ్ కంపెనీ మంగళవారం రికార్డు సృష్టించింది. భారతీయ స్టాక్ మార్కెట్లో షేర్ విలువ లక్ష రూపాయలకు చేరిన మొట్టమొదటి సంస్థగా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఎంఆర్ఎఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 42 వేల కోట్లుగా ఉంది. ఎంఆర్ఎఫ్ షేర్ విలువ గత 20 ఏళ్లలో 8,436 శాతం వృద్ధి చెందింది. అంటే, 2003 జూన్ 13న రూ. 1,175 గా ఉన్న ఎంఆర్ఎఫ్ షేర్ ధర 2023 జూన్ 13 నాటికి రూ. 1,00,300 కి చేరింది.
20 ఏళ్ల క్రితం ఎంఆర్ఎఫ్ షేర్స్ పై రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టినవారికి ఈ రోజుకి ఆ లక్ష రూపాయల విలువ రూ. 85.36 లక్షలకు చేరేది. ఇరవై ఏళ్లలో ఈ స్థాయిలో రిటర్న్ ఇచ్చిన మల్టీ బ్యాగర్ మరొకటి లేదని చెప్పవచ్చు. 2023, జూన్ 13న ఎంఆర్ఎఫ్ షేర్ విలువ 52 వారాల గరిష్టానికే కాదు.. రూ. 1 లక్షకు చేరి తొలి స్టాక్ గా చరిత్ర సృష్టించింది. దాదాపు సంవత్సరం క్రితం, అంటే జూన్ 17, 2022న ఎంఆర్ఎఫ్ షేర్ విలువ 52 వారాల కనిష్టమైన రూ. 65,900.05 గా ఉంది.
ఆ స్థాయి నుంచి సంవత్సరంలో దాదాపు 50% వరకు పెరిగి రూ. 2023 జూన్ 13 నాటికి రూ. 1,00,300 కి చేరింది. 2018 నుంచి 2021 వరకు మినహాయిస్తే.. ఎంఆర్ఎఫ్ స్టాక్ తొలి నుంచి మంచి ఫలితాలనే సాధిస్తూ వచ్చింది. గత 10 ఏళ్లలో బెంచ్ మార్క్ సెన్సెక్స్ కన్నా ఏడు సార్లు మంచి ఫలితాలను సాధించింది.
2023 లో కూడా, ఇప్పటివరకు బెంచ్ మార్క్ సెన్సెక్స్ 4% వృద్ధిని సాధిస్తే, ఎంఆర్ఎఫ్ స్టాక్ 12% వృద్ధిని సాధించింది. ప్రస్తుతం ఎంఆర్ఎఫ్ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 42వేల కోట్లుగా ఉంది. కాగా, ఇప్పటికీ ఈ స్టాక్ విలువ మరింత పెరిగే అవకాశముందని, సమీప భవిష్యత్తులో సంస్థ షేర్ విలువ రూ. 1.1 లక్షల వరకు చేరవచ్చని మార్కెట్ నిపుణులు అంచనావేస్తున్నారు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు