
చైనాకు కమ్యూనిస్టు దేశం అయిన క్యూబాలో గూఢచార స్థావరం ఏర్పర్చుకుని ఉందని అమెరికా ఆరోపించింది. క్యూబాలో చైనా గూఢచర్య కార్యాలయాలు నిర్వహిస్తోందని అమెరికా అధికారి చేసిన వ్యాఖ్యల ఆధారంగా అంతర్జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించాయి. 2019లో డొనాల్డ్ ట్రంప్ హయాంలో మొదలైన కార్యకలాపాలను చైనా మెల్లగా విస్తరిస్తోందని ఆయన ఆరోపించారు.
తమకు అందిన సమాచారం ప్రకారం చైనా స్పైబేస్ క్యూబాలో చాలా ఏండ్లుగా ఉందని పేర్కొన్నారు. ‘2019లో క్యూబాలోని గూఢచర్య సేకరణ వ్యవస్థలను చైనా అప్‌గ్రేడ్ చేసింది.. అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇవి ఇంటెలిజెన్స్ రికార్డు (అమెరికా)ల్లో పక్కాగా ఉన్నాయి’’ అని అమెరికా అధికారి తెలిపారు.
చైనా వేగు చర్యలను నివారించేందుకు ఇటీవలి కాలంలో అమెరికా విశ్వ ప్రయత్నం చేస్తోంది. చైనా ఆటకట్టు దిశలో ఇతర మిత్రదేశాల సహకారం తీసుకొంటోంది. దౌత్య మార్గాలు, ఇతరత్రా చర్యలతో చైనాకు చెక్ దిశలో కొంత పురోగతి ఉందని అమెరికా అధికార వర్గాలు వెల్లడించాయి. అమెరికా ఇంటలిజెన్స్ విషయాలపై పట్టున్న వైట్‌హౌస్ సంబంధిత అధికారి తన పేరు చెప్పకుండా చైనా వేగు చర్యలను ప్రస్తావించారు.
ప్రత్యేకించి క్యూబాలో చైనా వేగు స్థావరం ఉండటం ఆందోళన కల్గించే విషయం అని తెలిపిన ఈ అధికారి క్యూబా, చైనాలు కలిసి ప్రపంచవ్యాప్తంగా గూఢచార్య చర్యలను చేపట్టాలని వ్యూహాలు పన్నాయని వివరించారు.
మరోవైపు సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరించే వ్యవస్థను చైనా నిర్మించేందుకు క్యూబా అనుమతించింది. దీంతో ఆగ్నేయ అమెరికాలో సిగ్నల్ ఇంటెలిజెన్స్ సేకరణకు డ్రాగన్‌కు అవకాశం లభించినట్టయింది. ఈ అంశాన్ని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం కూడా ప్రస్తావించింది. ఇరు దేశాల మధ్య ఓ ఒప్పందం కుదిరిందని, ప్రతిఫలంగా క్యూబాకు చైనా ఆర్థిక సాయం చేయడానికి సిద్ధమైనట్టు పేర్కొంది.
దీంతో బైడెన్ సర్కారుపై విమర్శలు వెల్లువెత్తే పరిస్థితి నెలకొంది. అయితే, దీనిని అమెరికా నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి జాన్ కెర్బీ తోసిపుచ్చారు. ‘ఈ నివేదికలు పూర్తిగా కచ్చితమైనవి కావు.. ఇవి కొన్నేళ్లుగా జరుగుతున్న పరిణామాలే… ఇందులో పేర్కొన్న అంశాలు మా వద్ద ఉన్న సమాచారానికి సరిపోవడం లేదు’’ అని పేర్కొన్నారు.
More Stories
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
నేపాల్ కల్లోలం వెనుక అమెరికా `డీప్ స్టేట్’!
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!